ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు.. తెలుగు మీడియం అభ్యర్థుల ఆందోళ‌న‌…

ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష మార్చి 17న నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఇచ్చారు. చాలా ప్రశ్నలకు తెలుగు అనువాదం తప్పులు దొర్లాయంటూ పలువురు అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రశ్నలు అర్ధంకాక అభ్యర్థులను బెంబేలెత్తించాయి. ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలో తప్పులు దొర్లాయి. చరిత్ర విభాగం (బి సిరీస్‌) 22వ ప్రశ్నలో ఆంగ్లం నుంచి తెలుగులోనికి ‘అతివాద దశ’ అని అనువదించడానికి బదులు తీవ్రవాద దశగా పేర్కొన్నారు. పేపరు-2లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (సి సిరీస్‌) 66వ ప్రశ్నలోనూ తప్పులు దొర్లాయి. శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించి ‘కొత్త’ (నావెల్‌) పరికరం ద్వారా నిర్ధారణ పరీక్షలు అన్న ప్రశ్నకు తెలుగు అనువాదంలో ‘నవల’ అని ప్రింట్‌ చేయడంతో దాని అర్ధం పూర్తిగా మారిపోయింది.

అలాగే 109వ ప్రశ్నలో కోస్ట్‌గార్డ్‌ సైనిక విన్యాసాలు అని ముద్రించడానికి బదులు కోస్ట్‌గార్డ్‌ వ్యాయామమని ముద్రించారు. 89వ ప్రశ్నలో స్మార్ట్‌ బయోడిగ్రేడబుల్‌ అనే పదానికి ‘జీవవిచ్ఛిన్నం’ అని ఇవ్వడానికి బదులు ఇంగ్లిష్‌ పదాన్ని ఆంగ్లంలోనే యథావిధిగా ఇచ్చారు. అలాగే 90వ ప్రశ్నలో గుండ్రటి రూపం అని ఇవ్వడానికి బదులు రింగ్‌ ఆనే ఆంగ్ల పదాన్ని తెలుగులోనూ అదే విధంగా ఇచ్చారు. మరో ప్రశ్నలో తెలుగులో భ్రూణం అనే పదానికి బదులుగా పిండం అని ముద్రించారు. ఇలా ఎన్నో పశ్నలను తెలుగులో అర్థరహితంగా ముద్రించారు. క్వశ్చన్ పేపర్ లో ముద్రణా పరంగానూ కొన్ని తప్పులు దొర్లాయి. జైన మతరచనల గురించి వచ్చిన ప్రశ్నలో ప్రాకృతంకు బదులుగా కృతాం అని, జైనులు అనే పదానికి బదులుగా ‘ప్రాజైనులు’ అని ముద్రించారు. అలాగే మరోప్రశ్నలో ‘పార్లమెంటరీ విశేషాధికారాలు’ అనే పదానికి బదులుగా ‘పార్లమెంటరీ అధికారాలు’ అని అనువదించారు. అదే ప్రశ్నలో ‘వైడర్‌ ఇంప్లికేషన్స్‌’ అనే పదాన్ని విస్తృత పరిణామాలు అని అనువదించాలి.అయితే ప్రశ్నాపత్రంలో మాత్రం ‘విస్తృతమైన చిక్కులు’గా ముద్రించారు. దీంతో తెలుగు అభ్యర్ధులు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి నానఅగచాట్లు పడ్డారు. అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులోని ప్రశ్నలను పలుమార్లు చదివేందుకు అధిక సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల అనువాదం సరిగ్గా అర్థంకాక అయోమయానికి గురయ్యారు. కాగా కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రశ్నలను అనువాదం చేయడంలో తరచూ తప్పులు దొర్లడం ఇదే తొలిసారి. ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాల్లోని తెలుగు అనువాదం అర్ధం చేసుకోవడమే అభ్యర్ధులకు పెద్ద పరీక్ష అవుతుంది. కమిషన్‌ నిర్లక్ష్యం మూలంగా తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీలో వెనుకబడిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these