ఆ మూడు చోట్ల జగన్ మేమంతా సిద్ధం..

దేశంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. అన్ని పార్టీలు కూడా కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల యుద్ధంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి.

ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా నాలుగు చోట్ల బహిరంగ సభలను నిర్వహించింది. భీమిలీ, దెందులూరు, రాప్తాడు, అద్దంకిల్లో నిర్వహించిన ఈ బహిరంగ సభలకు లక్షలాదిగా జనం తరలివచ్చారు.

దీనికి కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటోన్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టారు.

ఈ నెల 27వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు జగన్. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధాకి నివాళి అర్పించిన అనంతరం బస్సు యాత్రలో పాల్గొంటారు. ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుందీ యాత్ర.

ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్ షోను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కమలాపురం మీదుగా ప్రొద్దుటూరులో ప్రవేశిస్తారు. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these