త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే నినాదంతో!

వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడింది. ఈనెల 20న మేనిఫెస్టో ప్రకటించాలని భావించినా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో వ్యూహం మార్చుకుంది వైసీపీ. మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 మేనిఫెస్టోను 99శాతం అమలు చేశామంటున్న వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది.జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే నినాదంతో మేనిఫెస్టో రూపకల్పన చేస్తోంది. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్ధుల సంక్షేమానికే పెద్దపీట వేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు జగన్‌ మేనిఫెస్టోతోపాటు ప్రచార రూట్‌మ్యాప్‌పై చర్చించారు. బూత్‌ కమిటీల ఎంపిక, పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్నికల వ్యూహాలపైనా ఫోకస్‌ చేశారు. వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన ఇప్పటికే తుది దశకు చేరుకుందని సమాచారం. సిద్ధం సభల వేదికగా ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగినా వాయిదాపడింది. త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

గ‌తంలో కంటే ప్రతి విష‌యంలోనూ అధిక ల‌బ్ధి క‌లిగించేలా మేనిఫెస్టో వుంటుంద‌ని వైసీపీ నేతలు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌పై ఫోకస్‌ చేసిన వైసీపీ ఈసారి మేనిఫెస్టోలో నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలతో మేనిఫెస్టో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన హామీలు కూడా ఉంటాయని సమాచారం. జగన్ చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం జనాల్లో ఉండటంతో వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి ఏర్పడిందంటున్నారు ఆ పార్టీ నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these