టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు బ‌ట్ట‌బ‌య‌లు!

Internal differences in TDP are exposed!

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. టీడీపీ నాయ‌కుడు సీఎం సురేష్‌నాయుడు ఇవాళ ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్‌, మొబైల్ క్యాంటీన్ వ్యాన్‌ను మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాయ‌ల‌సీమ వ్యాప్తంగా టీడీపీ నేత‌లంద‌రినీ ఆయ‌న ఆహ్వానించారు.

ఎన్నిక‌ల ముంగిట అన్న క్యాంటీన్ల రాజ‌కీయానికి సురేష్‌నాయుడు తెర‌లేప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్ జీ.ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి వైఖ‌రిపై ఆ పార్టీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. అన్న క్యాంటీన్‌, మొబైల్ వ్యాన్ ప్రారంభ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌వీణ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌మావేశానికి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ డుమ్మా కొట్టారు.  

స‌మావేశాన్ని క‌డ‌ప జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు ఎం. లింగారెడ్డి లీడ్ చేయ‌డం ఉక్కు ప్ర‌వీణ్‌కు న‌చ్చ‌లేదు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అయిన లింగారెడ్డి, నియోజ‌క వ‌ర్గ ఇన్‌చార్జ్ ప్ర‌వీణ్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. దీంతో లింగారెడ్డి న‌డిపే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప్ర‌వీణ్‌రెడ్డి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇదే కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి జేసీ దివాక‌ర్‌రెడ్డి, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇటీవ‌ల పాద‌యాత్ర‌లో భాగంగా ప్రొద్దుటూరుకు వ‌చ్చిన నారా లోకేశ్‌… టికెట్ ప్ర‌వీణ్‌కే అని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

దీంతో త‌నకు టీడీపీ పెద్ద‌ల ఆశీస్సులున్నాయ‌ని, స్థానిక నేత‌ల్ని లెక్క చేయాల్సిన ప‌నిలేద‌నే రీతిలో ప్ర‌వీణ్‌రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నా ర‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు టికెట్‌ను మాజీ ఎమ్మెల్యేలు వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి, లింగారెడ్డి, సురేష్‌నాయుడితో పాటు మ‌రికొంద‌రు ఆశిస్తున్నారు. కానీ ప్ర‌వీణ్ ఒక్క‌డినే లోకేశ్ చేర‌దీస్తుండ‌డం మిగిలిన నేత‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. మ‌రోవైపు ప్ర‌వీణ్‌రెడ్డి పెద్దాచిన్నా అనే గౌర‌వం లేకుండా న‌డుచుకుంటున్నార‌ని , ఇలాంటి వాడికి టికెట్ ఇచ్చినా గెల‌వ‌లేడ‌ని సొంత పార్టీ నేత‌లు అంటున్న ప‌రిస్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these