ఇప్పుడో వార్త రాజకీయంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే.. ఒక మహిళా కార్పొరేటర్ విషయం లో వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా మారిందన్న వాదన హాట్ టాపిక్ గా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అతగాడు.. తన వంకరబుద్ధిని పోనిచ్చుకోలేదన్న మాట వినిపిస్తోంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతుందని చెబుతున్నా.. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ ఎక్కడా దొరకని పరిస్థితి.
కొన్ని ప్రముఖ మీడియా సంస్థల్లో ప్రచురితమైన ఈ వార్త.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చను రేపుతోంది. దీంతో.. ఈ వార్తాంశం గురించి మేం ప్రత్యేకంగా ఫోకస్ చేసి.. వివరాలు సేకరించే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొదట ఇప్పటికే వెలుగు చూసిన వార్తాంశాన్ని చూస్తే.. నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక మహిళా కార్పొరేటర్ కు రాత్రిళ్లు ఫోన్ చేసి.. మాట్లాడుతున్నట్లుగా ఆరోపణ.
తాను ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు చెప్పుకున్న క్రమంలో.. సాయం చేస్తానన్న పేరు తో అడ్వాంటేజ్ తీసుకొని ఉంటారన్న ఆరోపణ ఉంది. ఆమె కు అండగా ఉంటానని చెప్పిన ఆయన.. రాత్రిళ్లు ఫోన్ చేయటం.. వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించినట్లుగా పేర్కొన్నారు. తిన్నావా.. లేదా? ఇంత లేట్ నైట్ వరకు తినకపోతే ఆరోగ్యం ఎలా? లాంటి మాటల్ని గోముగా మాట్లాడేవారని.. ఆ తర్వాత అసభ్యంగా మాట్లాడటంతో ఆమె కంగుతిన్నట్లుగా పేర్కొన్నారు.
తన సెల్ కు వచ్చిన కాల్ ను రికార్డు చేసిన ఆమె.. పార్టీ అధినాయకత్వానికి ఇవ్వగా.. వారు దీన్ని బయట కు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ అంశం వార్తాంశంగా రావటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఇదంతా వచ్చే ఎన్నికల కు సంబంధించిన సీట్ పంచాయితీగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లేదంటే.. ట్రాప్ లాంటిది కూడా కావొచ్చన్న వాదన వినిపిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తానెందుకు అలాంటి పనులు చేస్తానని బాధ పడినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇందులో ఎవరి వాదన నిజం? ఎవరిది అబద్ధం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిజం కాస్తంత నిదానంగా బయటకు వచ్చే వీలుందన్నమాట వినిపిస్తోంది.