రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో నెలరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి మార్చి రెండో వారంలో షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి. గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవంక.. తెలుగుదేశం- జనసేన కూటమి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మరోవంక- ఈ ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సాయంత్రం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు.
ఈ బహిరంగ సభను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వాని ఓ ట్వీట్ చేశారు. ఈ అయిదు సంవత్సరాల జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును చిత్రీకరించిన ఓ వీడియో క్లిప్‌ను దీనికి జోడించారు.
జగన్ నాయకత్వంలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏపీ సాధించిన జీఎస్డీపీ 50.8 శాతంగా నమోదైందని వివరించారు. మరే ఇతర రాష్ట్రం కూడా ఈ స్థాయిలో జీఎస్డీపీని అందుకోలేదని అన్నారు. కోవిడ్ వంటి అత్యంత క్లిష్ట పరిస్థితులనూ ఏపీ సమర్థవంతంగా ఎదుర్కొందని, దీనికి కారణం జగన్ నాయకత్వమేనని చెప్పారు.
జగన్ సారథ్యంలో రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి పరిమళ్ నత్వానీ చేసిన ఈ ట్వీట్‌ను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి రీట్వీట్ చేశారు. జగన్‌ను ప్రశంసించారు. అన్ని విధాలుగా ప్రశంసలకు అర్హుడు అంటూ ఓ కామెంట్‌ను పోస్ట్ చేశారు.