ఇక్కడ ఎవరో గుర్తు పట్టారా..? మహారాష్ట్ర గురుద్వారాలో..!

ఇక్కడ ఎవరో గుర్తు పట్టారా..? మహారాష్ట్ర గురుద్వారాలో..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ గురుద్వారాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పవిత్ర చాదర్ ను కూడా సమర్పించారు. అనంతరం పవన్ ను సచ్ కండ్ గురుద్వారా ఛైర్మన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ సిక్కుల టర్బైన్ ధరించి సంప్రదాయబద్దంగా కనిపించారు.

పవన్ కళ్యాణ్ ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాకు వెళ్లారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు ఆయన నాందేడ్ వెళ్లారు.

మధ్యాహ్నం సచ్ ఖండ్ గురు ద్వారాను పవన్ సందర్శించారు. ఆయనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి నమస్కరించారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని పవన్ కళ్యాణ్, ఫడ్నవీస్ కు అందించారు.

అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకుని వెలుపలికి వచ్చారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో కలసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అంతకు ముందు మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాకి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఛైర్మన్ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్ ను బహూకరించారు. గురుద్వారా సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారన్నారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుందన్నారు. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these