Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ముహూర్తం ఖరారు కావటంతో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్ల పైన ఫోకస్ చేసాయి. ఇప్పటికే పుష్కరాల కోసం ఆరు జిల్లాల్లో పుష్కర ఘాట్లు సిద్దం చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన కుంభమేళా తరహా లో ఈ సారి గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్ సిటీలు.. హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా రవాణా సౌకర్యం అన్ని ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది.
గోదావరి పుష్కరాలను జూన్ 26, 2027 నుంచి జూలై 7, 2027 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాల నిర్వహణ కోసం గోదావరి ప్రవహించే ఆరు జిల్లాలైన పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడలో సంబంధిత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లతో పాటు మొత్తం 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం చేసేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. గత పుష్కరాల అనుభవాల దృష్ట్యా ఈ సారి నగరానికి శివారున కాతేరును ఆనుకొని ఉంటూ ఉన్న 2 వీఐపీ ఘాట్‌లను నిర్మించనున్నారు. గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద వీటిని నిర్మిస్తారు. ఒక్కొక్కటి 250 మీటర్లకుపైగా నిర్మించేలా నిర్ణయించారు.
ప్రత్యేక సదుపాయాలు …….
పుష్కరాలకు వచ్చే ప్రముఖులు నేరుగా రాజమహేంద్ర వరంలోకి ప్రవేశించకుండా.. నేరుగా గామన్ బ్రిడ్జి మీదుగా ఇక్కడకు నేరుగా చేరుకునేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పలు ఘాట్ లను అనుసంధానం చేస్తున్నారు. సరస్వతీ, గౌతమీ అనుసంధానంతో పాటుగా టీటీడీ.. మార్కండేయ, శ్రద్దానంద, పద్మావతీ ఘాట్‌లను అనుసంధానం చేయనున్నారు. అదే విధంగా ధవళేశ్వరం దాటి బండ్ రోడ్డును సుమారు రూ.37 కోట్ల వ్యయంతో విస్తరించేలా నిర్ణయించారు. సుబ్బయమ్మ , ఆల్కట్ గార్డెన్స్ ఘాట్ ల విస్తరణకు ఆమోదం తెలిపారు. ఇక.. భక్తులకు వసతి సమస్యల లేకుండా టెంట్ సిటీలు ఏర్పాటుకు నిర్ణయించారు. కుంభమేళా లో ఈ తరహాలో చేయటం ద్వారా అంత మంది భక్తులు వచ్చినా.. సమస్యలు లేకుండా నిర్వహించారు. దీంతో.. గోదావరి పుష్కరాల సమయంలోనూ టెంట్ సిటీలు.. హోమ్ స్టే లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
