చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (rk roja) విమర్శించారు. నగరి సభలో చంద్రబాబు ఖాళీ కుర్చీలకు అలవోకగా అబద్దాలు చెప్పారని రోజా తెలిపారు. తన నియోజకవర్గంలో చంద్రబాబు చేసిందేమీ లేక చెప్పుకోలేని పరిస్ధితుల్లో జగన్ పై విమర్శలకు దిగారని ఆమె పేర్కొన్నారు. జగన్ క్రెడిట్ చేస్తున్న చంద్రబాబు.. తమ భూసర్వేను రద్దు చేసే ధైర్యం ఉందా అని రోజా ప్రశ్నించారు.
చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా చెప్పుకోవడానికి నగరిలో ఏ పనీ చేయలేదని, అందుకే నగరిలో మీటింగ్ కు ఎదురుగా ఉన్న ఆస్పత్రిలో పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీన్ చేశారన్నారు. నగరిలో రాజశేఖర్ రెడ్డి హయాంలో 100 పడకల ఆస్పత్రి పునాది వేసుకుంటే.. జగన్ హయాంలో పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేశారన్నారు. నగరిలో చంద్రబాబు హయాంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఆయన తండ్రి కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటివరకూ అద్దె భవనాల్లో ఉన్నాయని గుర్తుచేశారు.
జగన్ హయాంలో డయాలసిస్ సెంటర్లు, పార్క్, ఎలక్ట్రిక్ స్మశాన వాటిక, పుత్తూరులో పాలిటెక్నిక్ కాలేజ్, షాదీ మహల్ వంటి నిర్మాణాలు చేశాం. టీటీడీ ద్వారా వడమాలపేటలో కళ్యాణమండపం, నగరి రూరల్ లోని బుగ్గ అగ్రహారం దగ్గర మరొకటి కట్టామని, నిండ్రలో టెంపుల్, సబ్ స్టేషన్లు, ఐటీ కాలేజ్ కట్టాం. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, పేదలకు ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, కానీ నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఇదే జిల్లాలో పుట్టి నగరికి చేసిందేమీ లేదన్నారు. ముద్దు కృష్ణమనాయుడు, ఆయన కొడుకు భానుప్రకాష్ నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు.
భూముల రీసర్వేను భూతద్దంలో చూపించి జగన్మోహన రెడ్డి కాజేస్తారని విష ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు దాన్నే తమ గొప్పతనంగా చెప్పుకుంటున్నారని రోజా విమర్శించారు. గతంలో జగన్ పై చిమ్మిన విషాన్నే ఇవాళ మళ్లీ నగరిలో చిమ్మారన్నారు. జగన్ రీసర్వే వల్ల మీ ప్రభుత్వానికి 400 కోట్ల రాయితీ వచ్చింది నిజం కాదా ?, జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే మీరు రీసర్వే చేస్తున్నారుగా, జగనన్న తెచ్చిన పాస్ బుక్ ల అట్టలు మార్చి కాపీ క్యాట్ లా ఇస్తున్నది నిజం కాదా? జగనన్న తెచ్చిన డ్రోన్లు, హెలికాఫ్టర్లను తొలగించే ధైర్యం ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు.
