బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

 తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఇలాంటి పరిణామాలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు సీఎం చంద్రబాబు.

ఈ అంశాలపై దుబాయ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ రావుతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివాదానికి కారణమైన ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని సీఎం చంద్రబాబుకు చెప్పారు పల్లా శ్రీనివాస్. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదని పల్లాకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. యూఏఈ నుంచి వచ్చాక పార్టీలో ఘటనలు, నేతల వ్యవహారంపై తానే దృష్టి పెడతానని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే… కొంతమంది టీడీపీ నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.

పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా పాజిటివ్ నెస్ దెబ్బతీసేలా, క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించే వారిని ఇక ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలని.. ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలతో అనవసరమైన చర్చకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదని మందలించారు. క్రమశిక్షణ లేని టీడీపీ నేతలని కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం వచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే, దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశాన్ని పల్లా శ్రీనివాస్‌ రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these