కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సౌకర్యవంతంగా చేరుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి ఏటిగట్టు మీదుగా నేరుగా ఆలయాన్ని చేరుకునే నూతన రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తక్షణమే రూ. 6 కోట్లు మంజూరు చేశారు. రావులపాలెం మీదుగా ఉన్న ఇరుకు రోడ్డు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ 7 కిలోమీటర్ల కొత్త మార్గం ఉపయోగపడుతుంది.
కోనసీమ తిరుమల అయిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకునే భక్తుల ప్రయాణ కష్టాలు త్వరలో తీరనున్నాయి. నేషనల్ హైవే 216 నుంచి గోదావరి ఏటిగట్టు మీది నుంచి నేరుగా ఆలయానికి వెళ్లేందుకు.. చేరుకునేందుకు వీలుగా కొత్త రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ నిధుల నుంచి తక్షణం రూ. 6 కోట్ల నిధులను మంజూరు చేశారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి వాడపల్లి ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరున్న వాడపల్లి 7 వారాల వెంకటేశ్వరస్వామి ఆలయానికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న రావులపాలెం మీదుగా ఉన్న రహదారి ఇరుకుగా ఉండడంతో భక్తులు ట్రాఫిక్ రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జాతీయ రహదారి 216 నుంచి ఏటిగట్టు మీదుగా సుమారు 7 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్.. వెంటనే రూ. 6 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆమోదం తెలిపారు. ఈ కొత్త రహదారి అభివృద్ధి పూర్తి అయితే.. భక్తులు గోదావరి తీరాన ప్రయాణించడం ద్వారా ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో భక్తుల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు.. సౌకర్యవంతంగా ఆలయాన్ని చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
మరోవైపు.. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారికి ఆలయ హుండీల ద్వారా రూ.1.87 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఇటీవల దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు వెల్లడించారు. ఆలయ హుండీలను 35 రోజుల తర్వాత లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలతోపాటు విశ్వేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ 1.41 కోట్లు.. అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.45.63 లక్షలతో కలిపి మొత్తం రూ 1.87 కోట్లు వచ్చినట్టు ఈవో తెలిపారు. ఇవే కాకుండా 47 గ్రాముల బంగారం, 1.240 కిలోల వెండి.. యూఎస్‌ఏ, కువైట్, సింగపూర్, దుబాయ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల కరెన్సీ నోట్లు 25 వచ్చాయని పేర్కొన్నారు.
