తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ఈ కీలక పోరులో విజయం సాధించడంపై బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. సిద్ధ్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సహా ముఖ్య నాయకత్వంతో కలిసి ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కేసీఆర్ ప్రకటించారు. 25 వేల నుంచి 30 వేల మెజారిటీ ఓట్లతో గెలిచే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని, కాంగ్రెస్ దుష్ట పాలనపై మరింత అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజలకు చేసిన సేవలే ఆయన భార్య సునీత గెలుపునకు ప్రధాన కారణమవుతాయని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
సమీక్ష సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కోసం నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గుల్లగుల్ల చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను అభ్యర్థిగా నిలబెట్టడంపై గులాబీ బాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ ఈ అభ్యర్థిని నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
విజ్ఞులైన జూబ్లీ హిల్స్ ప్రజలు రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని కేసీఆర్ బలమైన విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నాయకత్వం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పార్టీ అధినేత ఆశించిన భారీ మెజారిటీ లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో దూకుడు పెంచేందుకు సిద్ధమైంది.
