CM Chandrababu: దుబాయ్ నుంచే వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆ జిల్లాలకు అత్యవసర నిధులు మంజూరు

CM Chandrababu: దుబాయ్ నుంచే వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆ జిల్లాలకు అత్యవసర నిధులు మంజూరు

విదేశీ పర్యటనలో ఉన్నా.. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రాబుబు దృష్టి సారించారు. రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత జిల్లాలకు అత్యవసర నిధులు మంజూరు చేయాలని సూచించారు.

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు మూడు రోజులుగా భారీగా వర్షలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది. అయితే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షప్రభావిత జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, కలెక్టర్లు, ఆర్టిజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీవర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితం అయిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కడప, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు ఎస్డీఆర్ బృందాలను, నెల్లూరు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణం మొహరించాలని ముఖ్యమంత్రి సూచనలిచ్చారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, రహదారులు, భవనాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, పిల్లలకు పాలు లాంటి ఆహారపదార్ధాలను అందుబాటులో ఉంచాలన్నారు. దక్షణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these