జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సొంత పార్టీలో ప్రక్షాళన చేపట్టారు. ఒకరు ఇన్ ఛార్జిగా ఉంటే ఇబ్బందులు వస్తున్నాయని ఆయన గ్రహించారు. అంతేకాదు పిఠాపురం నియోజకవర్గం జనసేనలో గ్రూపులుగా తయారవ్వడంపై కూడా పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆధిపత్యం కోసం వినియోగించుకుంటే అందరం ఇబ్బంది పడతామని హెచ్చరించారు. ఒకరు ఇన్ ఛార్జిగా వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతుందని భావించిన పవన్ కల్యాణ్ ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అందుకు ఫైవ్ మెన్ కమిటీని నియమించారు.
ఫైవ్ మెన్ కమిటీ…
పిఠాపురం నియోజకవర్గంలో ఇక ఏ నిర్ణయమైనా సరే ఫైవ్ మెన్ కమిటీ కూర్చుని నిర్ణయం తీసుకునేలా ఏర్పాటు చేశారు. కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పిడు గు హరిప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులను ఇన్ ఛార్జులుగా నియమించారు. దీంతో ఇప్పటివరకూ అనేక గ్రూపులుగా ఉన్నవారంతా ఒక్కటయి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఉపకరిస్తుందని పవన్ కల్యాణ్ అంచనా వేశారు. ఉప ముఖ్యమంత్రిగా తాను పిఠాపురం నియోజకవర్గంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడం లేదు కనుక ఇప్పటి వరకూ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇన్ ఛార్జిగా వ్యవహరించారు.
ఏకపక్ష నిర్ణయాలతో… అయితే మర్రెడ్డి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగినసమావేశంలో పవన్ కల్యాణ్ కు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో్ వారి ముందే మర్రెడ్డిని పవన్ కల్యాణ్ సున్నితంగా మందలించినట్లు తెలిసింది. ఒకరిచేతిలో పవర్ ఉండే కంటే ఐదుగురు కలసి తీసుకునే నిర్ణయాలు ఆలోచించి అందరికీ నచ్చేలా ఉంటాయని భావించిన పవన్ కల్యాణ్ ఐదుగురితో ఒక కమిటీని నియమించారు. ఇక తాజాగా పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలను చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసం నుంచే నిర్వహించాలని డిసైడ్ చేయడం కూడా ఆయన తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పాలి. మర్రెడ్డి పిఠాపురంలో ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసి చేబ్రోలు నుంచి నిర్వహించాలన్న ఆదేశాలతో ఇప్పటికైనా పిఠాపురం నియోజవర్గంలో జనసేన గాడినపడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.