ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో రెండు నెలల్లో ముప్ఫయి మందికి పైగా మరణించడానికి గల కారణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. అయితే తురకపాలెంలో మరణాలకు ఒక ఆర్ఎంపీ ఇచ్చిన మందులు, ఇన్ ఫెక్షన్లు కారణమయి ఉండవచ్చని ఆ దిశగా విచారణ సాగింది. ఆ ఆర్ఎంపీని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్ ను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. అయితే తాజాగా తురకపాలెంలో మరణాలకు, అనారోగ్య సమస్యలకు యూరేనియం అవశేషాలు కలిసిన నీరు తాగడం వల్లనేనంటూ మరో అధ్యయనంలో వెల్లడి కావడం విశేషం.
యురేనియంతో పాటు…
గ్రామంలో అందరికీ రక్త పరీక్షలు నిర్వహించారు. వాటిని ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు నీరు, మట్టి నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. అయితే నీటి నమూనాలు మాత్రం చెన్నై ల్యాబ్ కు పంపారు. ఈ ల్యాబ్ నుంచి రిజల్ట్ వచ్చినట్లు సమాచారం. అందులో తురకపాలెంలో ఉన్న నీటిలో యురేనియం అవశేషాలు వెల్లడయినట్లు తెలిసింది.తురకపాలెం గ్రామం చుట్టూ అనేక క్వారీలు ఉన్నందునఅక్కడ క్వారీ గుంతల్లో నీటిని ప్రజలు వినియోగిస్తున్నందున ఈ మరణాలు, తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. స్ట్రాన్షియం అనే పదార్థంతో పాటు ఈకొలి బాక్టిరియా కూడా నీటిలో ఉన్నట్లు కనుగొన్నారని చెబుతున్నారు.
బాక్టీరియా కూడా…
అలాగే గ్రామంలో వివిధ ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. కానీ ఒక్క చోట తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా బాక్టీరియా ఆనవాళ్లు లేవని గుర్తించారు. అయితే చెన్నై నివేదికలో మాత్రం అందుకు విరుద్ధంగా ఫలితాలు రావడంతో అక్కడి తాగు నీటి వల్లనే ఈ మరణాలు, తీవ్రమైన అనారోగ్యానికి కారణాలుగా వైద్యులు భావిస్తున్నారు. యురేనియం శరీరంలోకి వెళితే చాలా వెళితే చాలా ప్రమాదమని, దీనిద్వారా తొలుత కిడ్నీలకు, తర్వాత చర్మ సంబంధితమైన వ్యాధులు తలెత్తడమే కాకుండా మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, ఎముకలను దెబ్బతినడం ఖాయమని, అవే మరణాలకు కారణం కావచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి సమాచారం మాత్రం ఇంకా అందాల్సి ఉండటంతో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిపైఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పటి వరకూ వారికి రోజూ భోజనం, మంచినీరు అందించాలని నిర్ణయించారు.