వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడు రాజధానుల అంశం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో మూడు రాజధానుల ప్రతిపాదన హిట్ కాకపోవడంతో తిరిగి రాజధాని విషయంలో వైసీపీ నేతలు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈ మేరకు వైఎస్ జగన్ కు కూడా కొందరు నేతలు చెప్పినట్లు తెలిసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. గవర్నర్ ఆమోదానికి పంపారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరిపాలన రాజధాని ఏర్పాటుకు విశాఖలో సన్నాహాలు కూడా చేసుకున్నారు.
ఎక్కడా ప్రజల ఆదరణ…
రుషికొండలో ముఖ్యమంత్రి నివాసం కోసం పెద్ద భవనాన్ని కూడా నిర్మించారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలయింది. పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయింది. పరిపాలన రాజధాని అమరావతి ప్రాంతంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ, న్యాయ రాజధాని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ, పరిపాలన రాజధాని విశాఖ, అనకాపల్లి జిల్లాల ప్రజలు ప్రజలను ఆదరించలేదు. కేవలం గిరిజన ప్రాంతాల నుంచి మాత్రమే వైసీపీ గెలిచింది. మిగిలిన ప్రాంతాల్లో మూడు రాజధానుల ఎఫెక్ట్ బాగా పడింది. అంటే మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో ఇటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ ప్రజలు ఎవరూ దీనికి ఆమోదం తెలపలేదని ఫలితాల ద్వారా అర్థమయింది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న…
దీంతో మూడు రాజధానుల విషయంలో వైసీపీ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తుంది. అందుకే నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా పరిపాలనను రాజధాని నుంచి కొనసాగిస్తామని చెప్పడంతో తన స్టాండ్ ను మార్చుకున్నట్లుగా అర్ధమవుతుంది. జగన్ కూడా తాను అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేసి రాజధాని నిర్మాణం చేసే కంటే గంటూరు – విజయవాడల మద్య రాజధాని ఏర్పాటు చేస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనలను వెనక్కు నెట్టే అవకాశముంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నందునే వైసీపీ రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.