తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రకటించింది. ఎప్పుడెప్పుడు ఏ పథకం మంజూరు చేస్తామన్నది స్పష్టంగా ప్రకటిస్తామని చెప్పింది. కానీ నెలలు గడుస్తున్నా సంక్షేమ క్యాలెండర్ మాత్రం విడుదల కాలేదు. ఇందుకు నిధుల లేమి ప్రధాన కారణమని తెలుస్తోంది. నిధులు లేక ఆంధ్రప్రదేశ్ ఖజానా వెలవెలబోతుంది. ఇప్పటికే లక్ష 60 వేల కోట్ల రూపాయలకు పైగానే ఏడాదిలో అప్పులు చేసింది. మరొక వైపు సంక్షేమ పథకాలను అమలు చేసే తేదీలన ముందుగా ప్రకటిస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించి కొంత వెనక్కు తగ్గినట్లు కనిపిస్తుంది.
ఒక్కొక్క పథకాన్ని…
అయితే చంద్రబాబు మాత్రం నిధులను చూసుకుని సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించి ఈ మేరకు అప్పటి కప్పుడు పథకాన్ని అమలు చేసే తేదీని మాత్రం ప్రకటిస్తున్నారు. సూపర్ సిక్స్ లో ఇంకా కొన్ని హామీలు మిగిలిపోయాయి. ఇప్పటి వరకూ నాలుగు వేల రూపాయల పింఛను, దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను అమలుచేశారు. ఇక అన్నదాతల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని జులై మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశముంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు తాము కూడా వాటితో కలిపి విడుదల చేయాలని భావిస్తుంది. అయితే ఇందుకు తేదీ మాత్రం ఖరారు కాలేదు.
నిధులు అందుబాటును బట్టి…
జులై మొదటి వారంలో విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నా అది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడాన్నిబట్టి ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన హామీ మహిళలకు ఉచిత బస్సు పథకం. ఈ ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు డేట్ ఫిక్స్ చేశారు. అంటే ఈ పథకంకూడా గ్రౌండింగ్ డేట్ ఫిక్సయినట్లే. అయితే మిగిలిన పథకాల మాటేమిటి? విడుదలచేస్తామన్న సంక్షేమ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కానీ నిధులు అందుబాటులోకి వచ్చినప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళతామని,ఒక్కసారి మొదలు పెడితే ఏడాదిలో భారంగా మారి ఇబ్బందులు ఎదురవుతాయని టీడీపీ నేతలంటున్నారు. మొత్తం మీద వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకటించాలని అడిగిందెవరు? వాళ్లంతట వాళ్లే చెప్పి ఎందుకు వెనక్కు తగ్గారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.