అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం సంభవించిన భయంకరమైన విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బందితో పాటు, హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా మృతి చెందారు.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో అందులో 241 మంది చనిపోయినట్లు అహ్మాదాబాద్ సీపీ తెలిపారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ కూడా మరణించినట్లు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు. విమానంలో ఉన్న 229 ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది చనిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. విమానంలో మొత్తం 230 ప్రయాణికులు ఉండగా విశ్వస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న వాళ్లు మాత్రమే కాకుండా.. విమానం కూసిన బిల్డింగ్‌లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు. వారు ఎంత మంది చనిపోయారనే విషయం ఇంకా వెల్లడించలేదు. ఇంత ఘోర ప్రమాదంతో యావత్ దేశం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది.
అహ్మాదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిపోయింది. లండన్‌కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. విమానంలో 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో ఉంది.