ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ సాక్షి టీవీలో జరిగిన చర్చను నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇవాళ హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అమరావతిలో మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు ఇవాళ అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కొమ్మినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాక్షి టీవీలో అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ చర్చ పెట్టి అందులో కొమ్మినేని చేసిన వ్యాఖ్యలపై రఘురామ స్పందించారు. జర్నలిస్టులకు విధివిధానాలు నేర్పాల్సిన వ్యక్తి ఇలా జర్నలిజం విలువలు మర్చిపోయి మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటే కొమ్మినేని శ్రీనివాసరావు వెక్కిలి నవ్వులు నవ్వుతున్నారని రఘురామ ఆరోపించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలకు అలా సపోర్ట్ చేయడమనేది తీవ్రమైన చర్య అన్నారు.
సాక్షి టీవీలో ఈ వివాదాస్పద చర్చ గురించి తెలియగానే తాను చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు. ఈ వ్యవహారంలో డీజీపీ తగిన చర్యలు తీసుకుంటారని తనకు విశ్వాసం ఉందన్నారు. 24 గంటల్లోనే వాళ్లని అరెస్ట్ చేస్తారని వెల్లడించారు. రఘురామ చెప్పినట్లుగానే ఇవాళ పోలీసులు హైదరాబాద్ లో కొమ్మినేనిని అరెస్టు చేశారు. దీనిపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు కూడా దీనిపై సీరియస్గా ఉన్నారన్నారు.
సీఎం చంద్రబాబు అమరావతిని దేవతల రాజధాని అన్నారని, ఈ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రఘురామ ఆరోపించారు. అమరావతిపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. అమరావతిపై కామెంట్స్ వ్యవహారంలో సాక్షిలో పనిచేస్తున్న కొమ్మినేనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.