ఏపీలో తాజాగా అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ సాక్షి టీవీలో జరిగిన చర్చలో ప్యానలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, వాటిని అడ్డుకోలేదన్న కారణంతో ఇవాళ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కలకలం రేపుతున్నాయి. అయితే ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈసారి అధికార టీడీపీకి మద్దతుగా ఉండే ఓ టీవీ ఛానల్లో ఇది జరిగింది. ఇందులో కృష్ణంరాజు స్ధానంలో ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వచ్చి చేరారు. అమరావతి స్ధానంలో వైఎస్ జగన్ ఈ దూషణలు ఎదుర్కొన్నారు.
టీవీ5 ఛానల్లో ఇవాళ సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై చర్చ సాగుతోంది. ఇందులో ఫోన్ ఇన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ ఘటనపై స్పందిస్తూ రెచ్చిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బూతులతో ఆయనపై రెచ్చిపోయారు. అమరావతిపై వ్యాఖ్యల వివాదంలో కనీసం ముందుకొచ్చి సాహసం చేయని వెధవ అంటూ జగన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.
జగన్ పుట్టినప్పుడే విజయమ్మ ఆయన గొంతు నులిమి చంపేస్తే పీడా పోయేది అంటూ రేణుకా చౌదరి ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో యాంకర్ స్ధానంలో ఉన్న టీవీ5 తాజా సీఈవో మూర్తి ఆమెను వారించే ప్రయత్నం చేశారు. అయితే రేణుక వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీవీ డిబేట్లో ప్యానలిస్ట్ వ్యాఖ్యల వివాదంలోనే యాంకర్ గా ఉన్న కొమ్మినేని అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో ఇక్కడ యాంకర్ గా ఉన్న మూర్తి ఈ వ్యాఖ్యలు చేస్తున్న రేణుకా చౌదరిని అడ్డుకోవడం మంచిదైనట్లు తెలుస్తోంది.