TDP Mahanadu: తెలుగు జాతి అభివృద్దే ముఖ్యం.. ఎన్ని జన్మలైనా ఇక్కడే పుడతా: చంద్రబాబు

తెలుగు జాతి అభివృద్దే ముఖ్యం.. ఎన్ని జన్మలైనా ఇక్కడే పుడతా: చంద్రబాబు

పసుపు పండగ మహానాడు రెండో రోజు పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మరోసారి ఎన్నుకున్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌ను అభినందిస్తూ రాజకీయ తీర్మానం చేశారు.

కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన టీడీపీ మహానాడు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులతో మహానాడు ప్రాంగణం పసుపుమయమైంది. ఉదయం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు మహానాడు ఘనంగా నివాళి అర్పించింది. నారాలోకేష్‌ ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబం 6 శాసనాలలో ‘తెలుగు జాతి-విశ్వఖ్యాతి’ శాసనంపై పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి తొమ్మిది నెల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని.. విప్లవాత్మక మార్పులతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ అంటేనే తెలుగు జాతి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని..2047 కల్లా ప్రపంచంలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, కార్యకర్తలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో కలసి రావాలని చంద్రబాబు కోరారు. కార్యకర్తే తనకు హైకమాండ్.. సుప్రీమ్‌ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ది – సంక్షేమానికి సంబంధించి వివిధ అంశాలపై మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం నుంచి కేంద్ర సహకారంతో పునర్నిర్మాణం వైపు ఏపీ అడుగులు వేస్తున్న క్రమంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి-రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి అంశాలపై సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలు తెలిపారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సైనిక బలగాలు విజయవంతగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను అభినందిస్తూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఎన్నికైన చంద్రబాబుప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల పాటు ప్రతినిధుల సభ, వివిధ అంశాలపై ప్రసంగాలు, రాజకీయ తీర్మానాలతో వైభవంగా జరిగిన మహానాడు రేపు బహిరంగసభతో ముగియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these