మిమ్మల్ని నావాళ్లు అనుకున్నా.. నన్ను మాత్రం పరాయివాడిగా చూస్తారా..? తెలుగు సినిమా నాది అనుకుంటే నా సినిమాకే ఎసరు పెడతారా..? ఇండస్ట్రీ నాకిచ్చిన రిటర్న్గిఫ్ట్కు చాలాచాలా థ్యాంక్స్. నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూద్దురుగాని అంటూ చూపుడువేలితో హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం ఉరఫ్ టాలీవుడ్ పవర్‌స్టార్. గాడితప్పిన ఇండస్ట్రీకి రిపేర్లు చెయ్యడానికి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పేశారు. టోటల్‌గా తెలుగు సినీ పరిశ్రమలో పవనిజమ్ కమింగ్‌సూన్.. అని సాలిడ్‌గా సంకేతాలే వచ్చేశాయ్.
జూన్ 1 నుంచి తెలుగురాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ అనే బ్రేకింగ్ న్యూస్ అలా చల్లబడిందో లేదో.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ జనసేన అనే కొత్త ఎపిసోడ్ వేడిపుట్టిస్తోంది. పవన్ సినిమాను అడ్డుకోవడానికే ఎగ్జిబిటర్లు సిండికేట్‌గా ఏర్పడి.. థియేటర్ల మూతకు కుట్ర పన్నారన్న స్టేట్మెంట్ నేరుగా ప్రభుత్వం నుంచే రావడంతో శుక్రవారమే ఇండస్ట్రీలో ఫైర్ పుట్టింది.
థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక అసలేం జరిగిందన్న అంశంపై విచారణకు ఆదేశించేదాకా వెళ్లింది ఏపీ సర్కార్. కానీ.. థియేటర్ల బంద్కీ, పవన్ సినిమాకూ లంకె పెట్టి ప్రభుత్వమే మాట్లాడ్డంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. థియేటర్ల మూసివేత పర్యవసానాలు ఇక్కడితోనే ఆగలేదు. పవన్‌ని బిగ్‌స్క్రీన్ మీద చూసుకోవాలని తహతహలాడుతున్న ఫ్యాన్స్.. థియేటర్ల బంద్ నిర్ణయంతో నిరుత్సాహ పడిపోయారు. పవన్‌కి వ్యతిరేకంగా పరిశ్రమలో ఏదో జరుగుతోందన్న ఆందోళన కూడా కనిపించింది.
పవన్ సినిమాను అడ్డుకుంటే విధ్వంసాలకు సిద్ధమేనన్న జనసేన క్యాడర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో లేక.. సినిమా ఇండస్ట్రీ ధోరణిపై ముందటి నుంచి ఓ కన్నేసి ఉంచారో.. కారణం ఏదైతేనేం ఉగ్రరూపం దాల్చారు పవన్‌కల్యాణ్. తెలుగు సినీఇండస్ట్రీకి నేరుగా వార్నింగే ఇచ్చేశారు. హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకోడానికే థియేటర్ల బంద్ అనే కుట్ర పన్నారని భావిస్తూ వస్తున్న పవన్‌కల్యాణ్.. తెలుగు సినిమా పరిశ్రమపై కన్నెర్ర చేశారు. నేను సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే.. మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కి తగ్గట్టుగానే నా ట్రీట్మెంట్ ఉంటుంది.. అంటూ పవన్ పేషీ నుంచి వచ్చిన సంచలన ప్రకటన.. పెద్ద ప్రకంపనలే రేపింది.
కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయ్యినా, సినిమావాళ్లు ఎవరైనా సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారా.. సినిమా రంగ అభివృద్ధికి పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకే అడ్డంకులు సృష్టిస్తారా.. అని సూటిగా ప్రశ్నించింది పవన్ పేషీ. ఇకపై సినిమా వాళ్లతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు జరపదు.. సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలని హుకుం కూడా జారీ అయింది.
గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసింది.. కక్షసాధింపులకు దిగింది.. జరిగిన అవమానాల్ని, అగ్రనటులకు ఎదురైన ఛీత్కారాలూ అప్పుడే మర్చిపోయారా..? కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు.. సినిమా రంగం అభివృద్ధే ముఖ్యం.. అని చెప్పుకొచ్చింది పవన్ పేషీ. సినిమాల విడుదల సందర్భంలో మంత్రుల్ని కలవడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఎవరూ సంఘటితంగా రాలేదు.. ఇదేనా మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం అని పేర్కొంది. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా బడా నిర్మాతలంతా తనను కలిసినప్పుడు తాను ఆ విషయాన్నే చెప్పినట్టు గుర్తు చేశారు పవన్.
సినిమా ఇండస్ట్రీకి పవన్ ఏం చేయాలనుకుంటున్నారు..?
సినిమాకు పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపోదు.. చాలాచాలా చేయాలి. సినిమా నిర్మాణం నుంచి మార్కెటింగ్ దాకా మొత్తం 24 విభాగాల్లోనూ స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం.. అన్నిటికీ ఓ లెక్కుంది అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. అవసరాన్ని బట్టి స్పెషల్ క్యాంపులు, సెమినార్లు, సింపోజియమ్స్ లాంటివి ఏపీలో ఏర్పాటు చేయాలి. స్టూడియో నుంచి థియేటర్ వరకూ అన్న విభాగాల్లోనూ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలి. వీలైనంత ఎక్కువ మంది ఉపాధి కల్పించి.. ఇండస్ట్రీని టాప్‌లో నిలబెట్టాలి..! ఈ మొత్తం కార్యాచరణ కోసం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్.. CPD.. పేరుతో ఒక పాలసీని రూపొదించాలని పవన్ భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం చెబుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే సంబంధిత శాఖలతో చర్చించి సినిమారంగం అభివృద్ధిపై ఒక అవగాహనకు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి సిండికేట్‌గా ఏర్పడిన పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ పరిణామంతో ప్రేక్షకుడికి నష్టం జరుగుతోందా లాభం జరుగుతోందా అని ఆరా తీశారు.
ఏపీలో మల్టీప్లెక్సులు ఎన్ని ఉన్నాయన్న లెక్క తేల్చే పనిలో ఉంది కూటమి సర్కార్. ఈ మేరకు రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను ఆదేశించింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్‌గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నట్టు అనుమానిస్తోంది ప్రభుత్వం. ఈవిధంగా టికెట్ ధరలు పెంచి మరో రకం దోపిడీ జరుగుతోందనేది సందేహం. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, తిరుపతిలోని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ, టికెట్ ధరలు, ఫుడ్ స్టాల్స్ ధరలపై కూడా ఫోకస్ పెట్టబోతోంది.
థియేటర్లను వాటి యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధిక థియేటర్లు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? కొన్ని సినిమాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా.. అని కూడా ఆరా తీయనుంది. టికెట్ సేల్స్‌కీ, వచ్చే పన్నుకీ గ్యాప్ ఉంది. దీన్ని సవరించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వాళ్లపై నిఘా పెట్టాలన్నది ఏపీ సర్కార్ ఆలోచన.