అందమైన పహెల్గామ్లో కొన్ని రోజులు సంతోషంగా గడపాలని వెళ్లి ఉగ్రమూకల దాడిలో ప్రాణాలుకోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌళికి అంత్యక్రియలు కాన్వెంట్ జంక్షన్ హిందూ స్మశాన వాటికలో నిర్వహించారు. చంద్రమౌళి పార్థివ దేహానికి ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రిని కడసారి చూసి కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది
కశ్మీర్ లోని పహెల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి. ఈ రోజు చంద్ర మౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృత దేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోధించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. చంద్ర మౌళి అంతిమయాత్రలో విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. చంద్రమౌళి పార్థివ దేహానికి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
చంద్రమౌళి మృతితో విశాఖలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రమౌళి స్నేహితులు ఆయన లేడనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. కాశ్మీర్ పర్యటనను ఈరోజుతో ముగించుకొని.. అంటే ఏప్రిల్ 25వ తేదీన ముగించుకుని సేఫ్గా తిరిగి వస్తాడనుకుంటే.. ఈ రోజు ఇలా జరగడం చాలా బాధగా ఉందని బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు పహెల్గామ్ ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్ పార్థివ దేహానికి నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.