దిల్‌సుఖ్‌నగర్‌ మారణహోమంతో గుండెచెదిరిన భాగ్యనగరం!

దిల్‌సుఖ్‌నగర్‌ మారణహోమంతో గుండెచెదిరిన భాగ్యనగరం!

ఔను.. వీళ్లకు ఉరే సరి.. ఊపిరి ఆగేదాకా ఉరితాళ్లు బిగిస్తేనే.. వీళ్ల వల్ల ఉసురు పోగొట్టుకున్న అమాయకుల గుండెకైన నొప్పి ఎంతో తెలిసొచ్చేది. చావు ఎంతటి భయానకమో అనుభవంలోకొచ్చేది.. ఉత్తిపుణ్యానికే ప్రాణాలు తీయాలనుకునే తీవ్రవాదానికి అసలైన ముగింపు ఏంటో అర్థమయ్యేది..!

పన్నెండేళ్ల కిందట భాగ్యనగరాన్ని వణికించిన దిల్‌షుఖ్‌నగర్ జంట పేలుళ్లు.. 18 మందిని కడతేర్చిన నాటి కాళరాత్రి.. మరో 130 మందిని జీవచ్ఛవాలుగా మార్చేసింది. ఇవాళ్టిక్కూడా జంటనగర వాసుల గుండెల్ని బరువెక్కిస్తున్న దుర్ఘటన అది. పుష్కర కాలం పాటు ఎన్నో మలుపులు తిరిగిన ఆ కేసు ఇప్పటిగ్గాని కొలిక్కి రాలేదు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో అంతిమతీర్పును ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను తిరస్కరించడమే కాదు.. ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్‌ రియాజ్‌ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉండగా.. మిగిలిన ఐదుగురు నిందితులకూ ఉరిశిక్ష ఖరారైనట్టే..! ప్రధాన కుట్రదారు ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థేనని, పాత్రధారులు వీళ్లేనని తెలంగాణ హైకోర్టులో రుజువైంది. ఏడాదిన్నర పాటు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర కసరత్తు చేశాకే ఇది సాధ్యమైంది. దిల్‌షుఖ్‌నగర్ పేలుళ్ల ఘటన తీవ్రతను బట్టి మొదట్లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. వెంటనే రెండు కేసులూ ఎన్‌ఐఏకి బదిలీ అయ్యాయి. మూడేళ్ల పాటు దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. దుశ్చర్య వెనుక ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these