చంద్రబాబు, లోకేష్ సంచలన నిర్ణయం-ఎమ్మెల్యేలకు ఆదేశాలు..!

చంద్రబాబు, లోకేష్ సంచలన నిర్ణయం-ఎమ్మెల్యేలకు ఆదేశాలు..!

ఏపీలో అధికార కూటమిని నడుపుతున్న టీడీపీలో ఎమ్మెల్యేలకు ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో పెడుతూ.. ఇకపై వారితో సత్సంబంధాలు కొనసాగించేలా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు.

ఇకపై ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జ్ లు తమ నియోజకవర్గాల్లో ప్రతీ కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉందని వారు తెలిపారు. ఇటీవల కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.

ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలవాలని, సమస్యలు పరిష్కరించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. నారా లోకేష్ ఇప్పటికే తన నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు . క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ ఫీల్డ్ వర్క్, శంఖారావం ఫీల్డ్ వర్క్, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని అభినందిస్తున్నారు.

అలాగే అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించాలని ఆదేశాలు వెళ్లాయి. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాలు, కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మినిట్స్ ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.

ప్రతి నెల ఇంచార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించాలని కూడా ఆదేశాలు వెళ్లాయి. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలని, రెండవ రోజు పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కో ఆర్డినేటర్లతో కలిసి పార్టీ క్యాడర్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. మీటింగ్ మినిట్స్ ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలన్నారు. ఎవరైనా మీటింగ్స్ ను నిర్వహించని పక్షంలో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these