ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో గురువారం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు తమలోని నటనను బయటకు తీశారు.
పల్నాటి బాలచంద్రుడి ఏకాపాత్రాభినయంతో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ అదరగొట్టారు.స్టేజ్‌పై రొమ్ము గుద్దుకుంటూ చెప్పిన పల్నాటి సీమ డైలాగులు అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాయి. పల్నాటి బాలచంద్రుడి వేషంలో మంత్రి కందుల దుర్గేశ్‌ను చూసిన పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు.ఎమ్మెల్యే విజయ్ కుమార్ డ్రామా అందర్నీ ఆకట్టుకుంది.విజయ్ కుమార్ చేసిన స్కిట్‌కు చంద్రబాబుతో పాటు పవన్ పగలబడి నవ్వారు.
ఇక దుర్యోధనుడు వేషధారణలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అదరగొట్టారు. ‘ఏమంటివి..ఏమంటివి?’ అంటూ దానవీరశూర కర్ణ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్‌తో రఘురామ ఏకపాత్రాభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.