పల్నాడు కేంద్రంగా రంగంలోకి జగన్ -తొలి సమరం..!!

పల్నాడు కేంద్రంగా రంగంలోకి జగన్ -తొలి సమరం..!!

మాజీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ తిరిగి పార్టీ కేడర్ .. ప్రజలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెబుతున్న జగన్.. ఇప్పటికే పలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. పార్టీలో పెండింగ్ లో ఉన్న నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా పల్నాడు కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు.

రంగంలోకి జగన్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా నిర్వ హించేందుకు సిద్దం కావాలని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం హామీల అమలు చేయక పోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బడ్జెట్ కేటాయింపుల పైన జగన్ స్పందించారు. కూటమి నేత లపైన తన పోరాట తీవ్రతను పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా త్వరలో జిల్లాల పర్య టనలకు జగన్ సిద్దం అవుతున్నారు. ఉగాది తరువాత జిల్లాల టూర్ ప్రారంభం కానుంది. ఈ లోగా పార్టీలో పెండింగ్ పదవులను భర్తీ చేయనున్నారు. కీలక నేతల బాధ్యతలను మార్పు చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పల్నాడు కేంద్రంగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగన్ భరోసా

మాజీ సీఎం జగన్ ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలి సారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక దాదాపు 400 మంది వైసీపీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేసిందని జగన్ కు వివరించారు. అందులో ఎక్కువ శాతం మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందిన వారేనని చెప్పు కొచ్చారు. ఈ వివాదం పైన ఇప్పటికే కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. వీరికి జగన్ భరోసా ఇచ్చారు. వారు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా నిలుస్తామని చెప్పారు. గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతీ బాధిత కుటుంబానికి పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.

ఛలో పిన్నెల్లి

ఇదే సమయంలో త్వరలోనే ఛలో పిన్నెల్లి నిర్వహిస్తామని జగన్ వెల్లడించారు. పార్టీ శ్రేణులతో కలిసి పిన్నెల్లి గ్రామానికి బాధితులను తీసుకొని వెళ్తామని చెప్పుకొచ్చారు. జగన్ ను కలిసిన వారిలో పిన్నెల్లి గ్రామంతో పాటుగా తురకపాలెం, మాదెనపాడు,చెన్నాయపాలెం గ్రామాలకు చెందిన మరికొంత మంది ఉన్నారు. దీంతో.. జగన్ తాజా నిర్ణయం పార్టీలో సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అన్ని సీట్లను కైవసం చేసుకుంది. ఇక, ఇప్పుడు మారుతున్న సమీకరణాలతో జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో పల్నాడు జిల్లాలో రాజకీయంగా మరోసారి వేడెక్కుతోంది. జగన్ జిల్లాల పర్యటన పైన వచ్చే వారం కీలక ప్రకటనకు కసరత్తు జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these