జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురం సమీపంలోని చిత్రాడలో ‘జయకేతనం’ పేరుతో అత్యంత ఘనంగా సభ నిర్వహించాలని తలపెట్టారు. పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునేలా కార్యక్రమం ఉండాలని తెగ హడావిడి చేసేస్తున్నారు. దేశం మొత్తం తెలిసేలా చేయడం దేవుడెరుగు ముందు కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కి సామాన్య ప్రజలు హితబోధ చేస్తున్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల నేపధ్యంలో పిఠాపురంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తిస్తున్న యువ సైనికులు ఒక వైపు అయితే.. మరోవైపు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని ప్రశ్నించిన సామాన్యులపై దాడి చేస్తున్న వారు మరోవైపు ఉన్నారు. ఈ అతి చేష్టలతో జనసేన ఖ్యాతి పెరగక పోగా అబాసుపాలవుతుంది.
ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని సదరు వ్యక్తి కోరడంతో.. వెనక నుంచి జెండాతో వచ్చిన జనసేన నేత ఒకరు అతనిపై దాడి చేశారు. అంతే కాకుండా ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ సభ పేరిట జన సైనికులు అంతా మరి రెచ్చిపోయి ఇలా అతి చేష్టలకు దిగడం పట్ల సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతా జరుగుతున్న పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ఉండడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ఓ సభలో సైతం మాట్లాడుతూ పవన్ ఈ వయసులో బైక్ లను అలా నడపకపోతే ఎలా ? స్టంట్స్ చేయకపోతే ఇంకేం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. వారి కోసమే స్థలం సిద్దం చేస్తున్నానని అక్కడికి వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా బైక్ నడపవచ్చు అంటూ ఇన్ డైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అధినేత సైతం అలా కాదు అంటూ బుద్ది చెప్పాల్సింది పోయి .. ఇంకా చేయండి అంటూ ఎంకరేజ్ చేయడం ఏంటని సామాన్యులు అవాక్కవుతున్నారు. మొత్తానికి పవన్ తన సైనికులను కంట్రోల్ చేయలేక వారి దారిలోకే వెళ్లి సామాన్యులను ఇబ్బందులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.