నాగం గారూ…. ఎలా ఉన్నారు ? మాజీ సహచరుడుతో సీఎం చంద్రబాబు

నాగం గారూ.... ఎలా ఉన్నారు ? మాజీ సహచరుడుతో సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలాకాలం తరువాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారూ…ఎలా ఉన్నారు….ఆరోగ్యం ఎలా ఉంది…చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు…ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు.

ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్థన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు.

భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారని….పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయే వాళ్లని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎంతో ఎమోషన్‌గా ఉండేవారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం ఈ వ్యాఖ్యానించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి…తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు ముందు నాగం జనార్థన్ రెడ్డి టీడీపీలో పని చేశారు. తెలంగాణ ఉద్యోమం సమయంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన ఆయన ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these