నాకు, జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

జీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్ట్‌ వాటాల బదిలీ కేసులోసీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్‌ చేశారు. కొందరు ఎదగడానికి తనను కిందకు లాగారని అన్నారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని విజయసాయిరెడ్డి సూచించారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరకు తీసుకెళ్తారు.. లేదంటే దూరం పెడతారని ఆరోపణలు గుప్పించారు. చెప్పుడు మాటలను నాయకుడు నమ్మకూడదని జగన్‌ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీ, నాయకుడు నష్టపోతాడని అన్నారు.

కోటరీ వల్లే జగన్‌కు తాను దూరమయ్యానని విజయసాయిరెడ్డి ఆవేదన చెందారు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు చెప్పినా కూడా తన మాటలు పట్టించుకోలేన్నారు విజయసాయి. విరిగిన మనసు అతుక్కోదు..వైసీపీలో మళ్లీ చేరను అని తేల్చి చెప్పారు. జగన్‌కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

లిక్కర్ స్కామ్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డినేనని ఆయన ఆరోపించారు. దీని గురించి వివరాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తానని వెల్లడించారు.

కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితోపాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 విక్రాంత్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి, ఏ3 శరత్ చంద్రారెడ్డి, ఏ4 శ్రీధర్, ఏ5గా అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో విక్రాంత్‌ రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇదే కేసులో ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. ఇవాళ సీఐడీ ముందు హాజరయ్యారు.

ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. కేవీ రావుతో ముఖపరిచయం తప్ప లావాదేవీలు లేవని చెప్పారు. YV సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే విక్రాంత్ తెలుసన్నారు. కేసుగురించి KVరావుతో స్నేహితుడి ద్వారా మాట్లాడించా… ఓ అధికారి ఆదేశాలతో నా పేరు ఇరికించినట్టుగా కేవీరావు చెప్పారని తెలిపారు విజయసాయి. కేవీరావుకు విక్రాంత్‌రెడ్డిని పరిచయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. చివరి వరకు విక్రాంత్‌ రెడ్డే చేశారని కేవీ చెప్పారు.. ఇదే విషయాన్ని సీఐడీకి చెప్పానట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these