Yanamala : యనమలకు ఇక రాం..రాం..చెప్పేసినట్లేగా….

యనమలకు ఇక రాం..రాం..చెప్పేసినట్లేగా

సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి టీడీపీలో ఇక అవకాశాలు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఆయన వయసుతో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితులు టీడీపీ అధినాయకత్వం దూరం పెట్టిందనే చెప్పాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ యనమల రామకృష్ణుడు మంత్రి పదవిలో ఉంటారు. ఆయనకు తూర్పు గోదావరి జిల్లా నుంచి నియోజకవర్గం ఫిక్స్ అయినట్లేనని ఎవరైనా లెక్కలు వేసుకుంటారు. పైగా చంద్రబాబకు యనమల అత్యంత సన్నిహితుడిగా ముద్రపడింది. అనేక కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారన్న పేరు కూడా పార్టీలో యనమల రామకృష్ణుడికి ఉంది. సీనియర్ నేత అయినా ఆయన సేవలను ఉపయోగించుకుంటారని అందరూ భావించారు.

అప్పటి నుంచే…

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అప్పుడే కొంత సందిగ్దత మొదలయింది. దీంతో పాటు యనమలకు, లోకేశ్ కు మధ్య కెమెస్ట్రీ కుదరలేదన్న టాక్ పార్టీలో బలంగా ఉంది. లోకేశ్ ను పలకరించడానికి కూడా యనమలకు వయసు అడ్డురావడంతో పాటు ఇగో కూడా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుందంటారు. అందుకే ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు. గత వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టినప్పుడు యనమల రామకృష్ణుడు శాసనమండలిలో తన రాజకీయ చతురతను ఉపయోగించి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోగలిగారు.

ఫ్యామిలీ ప్యాక్…

అప్పుడు చంద్రబాబు నాయుడు యనమల వంటి సీనియర్ నేతలు పార్టీకి అవసరమన్న వ్యాఖ్యలను ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. మరొక వైపు ఎన్నికల ముందు నుంచే యనమలకు పొగ పెట్టడం ప్రారంభమయిందని అంటున్నారు. అయితే ఆయన కోరుకుంటున్న వారికి అందరికీ టిక్కెట్లు ఇవ్వడంతో తనకు పార్టీలో తిరుగులేదని భావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ తనకు ఎదురు లేదని కూడా కలలు గన్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కుమార్తె దివ్యకు తుని ఎమ్మెల్యే టిక్కెట్, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు మైదుకూరు టిక్కెట్, యనమల అల్లుడు మహేశ్ కుమార్ యాదవ్ కు ఏలూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఈ ముగ్గురు మొన్నటి ఎన్నికలలో విజయం సాధించారు. అది కొంత యనమలకు ఇబ్బందిగా మారింది.

అనేక కారణాలు…

మరొక వైపు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు కూడా టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లడం, అప్పుడు యనమల నిలువరించేందుకు ప్రయత్నం చేయకపోవడం వంటి కారణాలు కూడా యనమలకు ఎమ్మెల్సీ రెన్యువల్ కాకపోవడానికి కారణమని అంటున్నారు. చంద్రబాబుతో సమానంగా సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు బహుశ పార్టీలో ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందని ఊహించి ఉండరు. ఆయన ఈ మధ్యకాలంలో స్వరం పెంచి కొన్ని విమర్శలు చేయడం కూడా టీడీపీ అధినాయకత్వం ఆగ్రహానికి కారణమయింది. కొత్త నీటి కోసం పాత నీరు వెళ్లాల్సిందేనన్న నానుడి యనమల రామకృష్ణుడి విషయంలో స్పష్టమయింది. ఆయన బహుశ రాజకీయ విశ్రాంతి తీసుకుంటారేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these