ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఏదో జరిగిపోతుందని అందరూ ఊహించారు. కానీ ఇచ్చిన హామీలు అమలుపరుస్తామని చెబుతున్నప్పటకీ పెద్దగా అమలు కాలేదు. పింఛన్ల మొత్తాన్ని నాలుగు వేల రూపాయలుకు పెంచడం మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదన్న కామెంట్స్ క్షేత్ర స్థాయిలో వినపడుతున్నాయి. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నా మహిళలు అంత సంతోషంగా లేరన్నది కూడా అంతే వాస్తవం. అంతకు మించి ఇప్పటి వరకూ ఏ పథకాన్ని అమలు చేయకపోవడం.. అదిగో.. ఇదిగో అంటూ తేదీలు మారుస్తూ కాలయాపన చేస్తుండటంతో ప్రజలపై కూటమి ప్రభుత్వం పట్ల ఆశలు సన్నగిల్లినట్లే కనపడుతుంది.
ఆందోళనలో అన్నదాతలు…
ఇక ప్రధానమైన వర్గం రైతులు కూడా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో గతమే మేలన్న అభిప్రాయానికి అన్నదాతలు వచ్చే అవకాశముంది. మిర్చి రైతులను ఆదుకుంటున్నామని ప్రభుత్వం హడావిడి చేసిన ప్రకటనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఏ పంటకు సరైన ధర లభించడం లేదని రైతాంగం ఆందోళన చెందుతుంది. మరొక వైపు అన్నదాత సుఖీ భవ పథకాన్ని ఇస్తామని ప్రకటిస్తున్నా తమ ఖాతాల్లో పడేంత వరకూ ఎవరికీ నమ్మకం లేదు. అందులో ప్రతి పథకంలో లబ్దిదారుల ఎంపిక ఎలా ఉంటుంది? తమ పేరు అందులో ఉంటుందా? లేదా? అన్న సందేహాలు కూడా కర్షకులకు కంటి మీద కునుకులేకుండా పోయింది.
పైసా కూడా చేతులో లేక…
ఇక మహిళలకు ఉచిత బస్సు పథకం ఊసే లేకపోవడంతో పాటు పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాని పేరు కూడా తలవడం లేదు. గత వైసీపీ హయాంలో ఏదో ఒక రూపంలో డబ్బులు వచ్చేవి చేతుల్లో ఉండేవి. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తమకు అందలేదన్న నిరాశా, నిస్పృహలు అయితే బాగా కనపడుతున్నాయి. ఏ పథకాన్ని అమలు చేయాలన్నా నిధులు లేవని ప్రభుత్వం పదే పదే చెబుతుండటంతో తమకు ఇప్పట్లో అవి దరి చేరే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చారు. అయితే అధికార పార్టీని ఏమీ అనలేక, తమలో తాము మహిళలు ఆర్థికంగా చితికిపోక తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది.
నాడు జగన్ కూడా…
ఇక గత వైసీపీ ప్రభుత్వంలోనూ జగన్ ఇలాగే భావించారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందని, తనను పథకాలే తిరిగి గెలిపిస్తాయని జగన్ గట్టిగా నమ్మారు. కానీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పుడు కూడా కూటమి పార్టీల పరిస్థితి అలాగే ఉంది. ఈయన కంటే ఆయనే బెటర్ అన్న భావనకు ప్రజలు వచ్చే అవకాశముంది. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో తీసుకెళుతున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనం మాత్రం అంతగా సంతృప్తికరంగా లేరన్నది వాస్తవం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. జనంలోకి వెళ్లి వారికి నచ్చ చెబుదామన్న చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. కొన్నిచోట్ల మహిళలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారుల నుంచి వచ్చే నివేదికలను కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తల ఒపీనియన్ తీసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.