Andhra Pradesh: చరిత్ర సృష్టించబోతున్న ఏపీ మహిళా సంఘాలు.. గిన్నిస్‌ రికార్డు దిశగా..

Andhra Pradesh: చరిత్ర సృష్టించబోతున్న ఏపీ మహిళా సంఘాలు.. గిన్నిస్‌ రికార్డు దిశగా..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్‌డీసీ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.. ఆన్‌లైన్‌ ద్వారా చేసే ఈ డిజిటల్‌ మార్కెటింగ్‌ కోసం ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి గురించో, అలాగే చిన్నగా ప్రారంభించి దినదినాభివృద్ది సాధించిన సంస్థ గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయారు’ అని చెప్పుకుంటుంటాం. అలాంటి నానుడి స్వయం సహాయక సంఘాలకు సరిగ్గా సరిపోయేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. స్వయం సహాయ సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ఒకే రోజు 5 కోట్ల ఈ-వ్యాపారం చేయించడం ద్వారా అరుదైన గిన్నిస్‌ బుక్‌ రికార్డును సాధించేందుకు సమాయాత్తమయ్యారు. అందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా మారనుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల విక్రయాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో నిలవనుంది. ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై పరిశీలన చేసి గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డు తన బుక్‌లో ఏపీ స్వయం సహాయక సంఘాలకు ఒక పేజీ కేటాయించనుంది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు ఒకే రోజు 5 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆన్‌లైన్ ప్లాట్ పారం ద్వారా విక్రయించనున్నారు. ఇప్పటికే 3 లక్షల ముందస్తు ఆర్ధర్లు వచ్చాయి. ఈ విక్రయాలను ఏపీ సీఎం చంద్రబాబు మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సదస్సులో బటన్ నొక్కి ప్రారంబిస్తారు. స్వయం సహాయక సంఘాలు ఇంత పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులను ఒకే రోజున భారీ ఎత్తున విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనున్నాయి.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్‌డీసీ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.. ఆన్‌లైన్‌ ద్వారా చేసే ఈ డిజిటల్‌ మార్కెటింగ్‌ కోసం ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని స్టార్టప్ కంపెనీలు రూపొందించిన యాప్‌ల ద్వారా సంఘాలు తయారు చేస్తున్న వేల రకాల ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. వీటికి మంచి స్పందన రావడంతో ఇందులో ఒకేరోజు లక్షకు పైగా ఆర్డర్ల ద్వారా ప్రపంచ రికార్డు సాధించేలా ప్రణాళిక తయారు చేశారు.

గత ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభమైన ఆర్డర్లు అంచనాలకు మించి 3 లక్షల వరకు వచ్చాయి. ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగా డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు బటన్‌ నొక్కి ప్రారంభించే ఈ డిజిటల్‌ మార్కెటింగ్‌ కార్యక్రమాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు పరిశీలిస్తారు. అనంతరం సర్టిఫికెట్‌ ఇవ్వనున్నారు. మార్చి 8వ తేదీన బుక్‌ అయిన ఈ ఆర్దర్లు కొనుగోలు దారులకు డెలివరీ చేస్తారు.

పచ్చళ్లు, పిండి వంటలకు ఆదరణ…

రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను ప్రీ బుకింగ్‌ విధానంలో ఇప్పటికే వివిధ రకాల పచ్చళ్లు, కారాలు, తినుబండారాలు, జూట్‌ ఉత్పత్తుల కొనుగోళ్లకు విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మూడు లక్షల ఆర్దర్లలో ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఈ-కామర్స్ వేదికను మహిళా సంఘాలు మరింత విస్తృతంగా ఉపయోగించుకోవడంపై అవగాహన కల్పించేందుకు మెప్మా, సెర్చ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు శిక్షణ పొందారు. మెప్మా ద్వారా తాము తయారు చేసుకున్న ఉత్పత్తులను దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతున్నామని ఒంగోలులోని స్వయం సహాయక సంఘాల ద్వారా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా వ్యాపారాలు చేస్తున్న మహిళా వ్యాపారవేత్త శిరీష చెబుతున్నారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకున్న చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు మెప్మా సహాయ పడటంతో ఇప్పుడు వాటిని విస్తరణ దిశగా మహిళలు అడుగులు వేస్తున్నారు. తమతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తొలుత చిన్నగా ప్రారంభించిన ఉత్పత్తులను ఇప్పుడు విదేశాలకు సైతం ఎగుమతులు చేసే విధంగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా అవకాశాలు వస్తున్నాయని స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చెబుతుండటం విశేషం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these