పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

 పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు అయింది.ఈ కేసులో ఉమ్మడి కడప జిల్లాలోని ఓబులరెడ్డి పల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన కేసులో మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను మొబైల్ కోర్టు కొట్టి వేసింది. మరోవైపు పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో పోసానిపై నమోదైన కేసులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. అయితే పోసానికి రెండు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ.. నరసరావుపేట కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలు పోసానిని పోలీసులు విచారించనున్నారు. అయితే పోసాని కోరితే.. న్యాయవాది సమక్షంలో ఆయన్ని విచారించాలంటూ పోలీసుకు కోర్టు సూచించింది. ఇంకోవైపు.. పోసాని బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

జగన్ ప్రభుత్వ హయాంలో..

పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిలిం టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌టీవీడీసీ) చైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళిపై పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.అలాగే సీఐడీ సైతం పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది. అయితే ఫిబ్రవరి ఆఖరి వారంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఆయన నివాసంలో ఏపీలోని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌‌కు పోసాని కృష్ణమురళిని తరలించారు. అయితే వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో.. పోసానికి ఒక కేసులో బెయిల్ లభిస్తే.. మరో కేసులో ఆయన విచారణ ఎదుర్కొవలసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోసానికి బెయిల్ వస్తుందా? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these