నోరుంది కదా అని ఏదిపడితే అది మాట్లాడితే.. జగన్‌కు లోకేష్ కౌంటర్

Nara Lokesh: ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి.. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై నారా లోకేష్ ఏమన్నారంటే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన లోకేష్.. పవన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అహంకారానికి ప్యాంటూ, షర్టు వేస్తే జగన్ అంటూ నారా లోకేష్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయినప్పుడూ.. ఎప్పుడూ కూడా ప్రజలకు దూరంగా ఉన్నారంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన నారా లోకేష్.. మొన్నటి ఎన్నికల్లో జగన్‌కి వచ్చిన మెజారిటీ ఎంత? పవన్ కళ్యాణ్‌కి వచ్చిన మెజారిటీ ఎంత అంటూ ప్రశ్నించారు. వైసీపీని ఎన్నిసీట్లు వచ్చాయి, జనసేనకు ఎన్నిసీట్లు వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని, సరైన పద్ధతి కాదంటూ నారా లోకేష్ హితవు పలికారు.

ఈ సందర్భంగానే వైసీపీకి ప్రతిపక్ష హోదా గురించి కూడా నారా లోకేష్ ప్రస్తావించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిర్ణయం ప్రజలు తీసుకున్నారన్న నారా లోకేష్.. ఆ సంగతి వైఎస్ జగన్‌కు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రభుత్వా్న్ని కించపరిచేలా మాట్లడతారా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 10 శాతం సీట్లు రావాలన్న నారా లోకేష్.. వైసీపీకి 11 సీట్లే ఎందుకు వచ్చాయో వైసీపీ, వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. వైఎస్ జగన్ విధానాల వలన రాష్ట్రం దెబ్బతిందన్న లోకేష్.. కూటమి ప్రభుత్వం చక్కదిద్దే పనిలో ఉందన్నారు.

మరోవైపు తాడేపల్లిలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన జీవితంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారని సెటైర్లు వేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాలంటే జర్మనీకి వెళ్లాలంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వైఎస్ జగన్ వద్ద విలేకర్లు ప్రస్తావించగా.. జగన్ ఇలా స్పందించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్ తప్పుబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these