అసెంబ్లీలో చంద్రబాబుతో పవన్ భేటీ.. ఆ విషయంపైనేనా?

అసెంబ్లీలో చంద్రబాబుతో పవన్ భేటీ.. ఆ విషయంపైనేనా?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఛాంబర్‌కు వెళ్లారు. అసెంబ్లీలోని చంద్రబాబు ఛాంబర్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్.. గంటపాటు ఆయనతో చర్చలు జరిపారు, ఏపీ బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపుల చర్చించినట్లు తెలిసింది. అలాగే తల్లికి వందనం, అన్నదాత పథకాల అమలుపైనా ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటు పలు రాజకీయ అంశాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చర్చించినట్లు సమాచారం. అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29తో ఐదుగురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్‍బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా సోమవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే ఎన్డీఏ కూటమి సంఖ్యా బలం దృష్ట్యా ఈ ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఐదు ఎమ్మెల్సీ స్థానాలల్లో జనసేన‌ పార్టీ రెండు, బీజేపీ ఒక ఎమ్మెల్సీ పదవిని కోరుతున్నట్లు తెలిసింది. దీనిపైనా చంద్రబాబు, పవన్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఐదు స్థానాలు కూటమికే దక్కనున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాని నేతలు, టికెట్ త్యాగం చేసిన నేతలు ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబుతో పాటుగా మరొకరికి ఎమ్మెల్సీ పదవిని జనసేన కోరుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. సీట్ల లెక్కలను, అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these