ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారంటున్నారు. ప్రశ్నించడం మానేసి ఫక్తు రాజకీయ నేత అవతారమెత్తారన్నది ఆ పార్టీనేతలతో పాటు సొంత సామాజికవర్గం నుంచి వినిపిస్తున్న మాటలు. గతంలో పదేళ్ల పాటు ప్రశ్నిస్తూ, ప్రభుత్వాన్ని ఎదరిస్తూ పాలిటిక్స్ లోనూ పవర్ స్టార్ గా చెలామణి అయిన పవన్ కల్యాణ్ గొంతు గత తొమ్మిది నెలల నుంచి పెగలకపోవడంపై సొంత పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తంచేస్తుంది. ఎవరైనా పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. లక్షలాది మంది ఆయన అభిమానులతో పాటు, కాపు సామాజికవర్గం కూడా పవన్ వల్లనే తొలిసారి తమకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించారు.
మరో పదిహేనేళ్ల పాటు…
కానీ పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమయ్యేటట్లు కనిపించడం లేదంటున్నారు. మొన్న పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి గా కొనసాగాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్ తాజాగా మరో ఐదేళ్లు పెంచి పదిహేనేళ్ల వరకూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పారు. ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ తాము కలసే ఉంటామని చెప్పారు. జగన్ పై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ చంద్రబాబు పరిపాలన దక్షతను మరోసారి ప్రశంసించారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయం విషయంలో కానీ, మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వదిలేయడాన్ని వేరేరకంగా అభిమానులు చూస్తున్నారు.
జగన్ ను నిందించినా…
గత పదేళ్లు తాము చూసిన పవన్ కల్యాణ్ వేరు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్న ఆయన వేరు అన్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రశ్నించకుండా ప్రశంసించడమేంటని జనసేన నేతలే అంటున్నారు. జగన్ ను ప్రజలు ఛీ కొట్టారు. ఆయనను అధికారానికి దూరంగా ఉంచారు. అలాంటి జగన్ ను విమర్శించి ఏమాత్రం ప్రయోజనం లేదు. అదే సమయంలో ప్రజాసమస్యలపై నిలదీసే తత్వాన్ని పవన్ కల్యాణ్ పూర్తిగా కోల్పోయారంటూ జనసేన పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. సనాతన ధర్మమంటూ తిరిగితే సరిపోతుందా? ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన పనిలేదా? అని ఎదురు ప్రశ్నలు పవన్ కు ఎదురవుతున్నాయి.
ప్రజాసమస్యల పరిష్కారానికి…
కూటమి ధర్మం కాబట్టి పవన్ కల్యాణ్ టీడీపీని ప్రశ్నించలేకపోవచ్చు. కానీ అదే సమయంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నించడం ఎంత మాత్రం తప్పు కాదు. మిర్చి రైతుల ఆందోళన జరుగుతున్నప్పుడు మిర్చి యార్డుకు వెళ్లవచ్చు. అలాగే కొన్నినిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నా, దానిని వెనకేసుకు రావడం ఏమాత్రం బాగాలేదని సొంత పార్టీ క్యాడర్ అంటుంది. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ అధికారంలో లేరు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లింది. అధికారంలో లేనప్పుడు సుగాలి ప్రీతి హత్య వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావించిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అడగటం లేదని కూడా అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ క్రమంగా పొలిటికల్ పరంగా ఇమేజ్ కోల్పోతున్నట్లే కనపడుతుంది. ఆయనలో ప్రశ్నించే తత్వం కనుమరుగై ప్రశంసించడమే పనిగా పెట్టుకోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.