ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు విపక్ష నేత హోదా కావాలని పదే పదే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇదే కారణంతో ఆయన ఏడు నెలలుగా అసెంబ్లీకి కూడా రాకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీకి వచ్చినా గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే నిరసనకు దిగి అసెంబ్లీకి మరోసారి బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. దీనిపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విపక్ష నేత హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు.
ఓట్ల శాతం ఆధారంగా విపక్ష నేత హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని, ఎందుకంటే అసెంబ్లీలో సీట్ల పరంగా చూస్తే వైసీపీ కంటే జనసేనే పెద్ద పార్టీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ పవన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో అంబటి రాంబాబు ఓ పోస్టు పెట్టారు.
ఏపీలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ జనసైనికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాజాగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు ఓ వాదన తీసుకు వచ్చినప్పుడు కూడా పవన్ ను సీఎం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే డిప్యూటీ సీఎం లేకుండా కేవలం సీఎం మాత్రమే ఉన్న చిన్న రాష్ట్రం గోవాకు వెళ్లాలంటూ అంబటి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అంబటి కామెంట్స్ పై జనసైనికులు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు.