ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార ప్రతినిధి హోదాకు కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు జీవీరెడ్డి ప్రకటించారు.
బాబుకు లేఖ…
ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తనపై ఉంచిన విశ్వాసానికి,అందించిన మద్దతుకు కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు జీవీరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మరింతగా బలంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఇక తాను పూర్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగాలని నిర్ణయించుకున్నానని, రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నానని, ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని జీవీరెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.