మాజీ సీఎం జగన్ సారధ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష హోదాపై మరోసారి గట్టిగా డిమాండ్ చేయాలని వైసీపీ నిర్ణయించింది. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్.. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ ఇప్పటికే ఒక ప్లాన్ ను రూపొందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్నది నాలుగు పార్టీలు మాత్రమేనని.. అందులోని టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టేందుకు నేతలు అసెంబ్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా ఒక పార్టీని ప్రతిపక్షంగా గుర్తిస్తే కచ్చితంగా అధికార పార్టీ తర్వాత ప్రతిపక్షానికే అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సభా కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజల గొంతు విప్పటానికి ఒక హక్కుగా తగిన సమయం కూడా వారికి లభిస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే ఆ స్థాయిలో సమయం కేటాయించరు. ఈ కారణంతోనే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు కూటమి ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కావాల్సిన అన్నీ సీట్లు వైసీపీ గెలవలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా పలుమార్లు స్పందించారు. జగన్, వైసీపీ నేతలు అసెంబ్లీకి రావాలని తెలిపారు. నిబంధనల ప్రకారమే ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.