ఏపీలో అధికార ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న ఇద్దరు నేతల వ్యవహారశైలిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సూటి ప్రశ్నలు వేశారు. తొలిసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై ఇవాళ ప్రశ్నలు గుప్పిస్తూ ట్వీట్లు పెట్టారు. ఇందులో ఇద్దరు నేతల తీరుపై ఆయన మండిపడ్డారు. బాధ్యతాయుత స్ధానాల్లో ఉన్న వారు ఇలా చేస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అపోలోలో పవన్ కు స్కానింగ్, ఇతర పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని తెలిపారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏపీ ఆస్పత్రుల్ని వదిలి ఇలా తెలంగాణలోని హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆస్పత్రులపై ఆయనకు నమ్మకం లేదా అని అడిగారు.
మరోవైపు రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న వేళ ఇవాళ మంత్రి నారా లోకేష్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ సానా సతీష్, టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ తో కలిసి దుబాయ్ లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో కనిపించారు. దీనిపైనా వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. గ్రూప్-2 అభ్యర్థులు రోడ్డు మీద ఏడుస్తుంటే…, రేపటి నుండి కీలకమైన రెండో ఏడాది బడ్జెట్ సమావేశాలుంటే..,మీరు సినిమా వాళ్ళతో కలిసి దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన తీరు చూసి విద్య లోకం గర్విస్తుంది లోకేష్ గారు… గర్విస్తుంది అన్నారు.