ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలకే పరిమితమయ్యేటట్లే కనిపిస్తుంది. ఆయన ఇకపై సినిమాలు చేయడానికి సిద్ధంగా లేరన్న వార్తలు ఆయన ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒప్పందం చేసుకున్న సినిమాలను ఎలాగోలా పూర్తి చేసి పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది. సరైన సమయంలో తిండి లేకపోవడం, నిద్రలేమి వంటి వాటితో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. కానీ కసితో రాజకీయాలకు వచ్చిన పవన్ కల్యాణ్ దానినే ప్రధానంగా ఎంచుకోవవాలని నిర్ణయించుకున్నారు.
రెండు పడవల మీద…
రెండు పడవల మీద కాలు మోపేకంటే ఒకదానిలో ఉండి లక్ష్యాన్ని చేరడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల ఒక దర్శకుడు పవన్ కల్యాణ్ తో సమావేశమై కధ వినిపించడానికి సిద్ధమవ్వగా అందుకు పవన్ సున్నితంగా తిరస్కరించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాను ఇకపై సినిమాలు చేయదలచుకోలేదని, ప్రస్తుతం తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉన్నందున సినిమాలకు ఇకపై సంతకం చేయనని చెప్పినట్లు తెలిసింది. పవన్ సన్నిహితుడు తివిక్రమ్ కూడా ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పడంతో ఇందులో నిజముందని అనుకోవాల్సి ఉంది.
తనపై పెట్టుకున్న ఆశలు …
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏపీ ప్రజలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, తాను రాజకీయాల్లో ఎదిగి తిరిగి ఓడి వెనుదిరగడానికి పవన్ ఇష్టపడటం లేదు. జనసేన పార్టీ పెట్టినప్పుడే తాను ఇరవై ఐదేళ్లు రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు పవన్ కల్యాణ్. అనుకున్నట్లుగానే పదో ఏడాది ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలతో పాటు కొన్ని కీలక, సున్నిత అంశాలను కూడా పరిష్కరించడానికి ఆయన సతమతమవుతున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతో ప్రభుత్వంపై కూడా ఆయన వత్తిడి తేలేకపోతున్నారు.
బాడీ షేమింగ్ కు …
ప్రధానంగా యువతకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాననే బాధ అయనలో కనపడుతుందంటున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారికి పది లక్షల రూపాయల వరకూ రుణం మంజూరు చేసేదానిపైనా కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతుండటం, భోజనం చేసే సమయం కూడా లేకపోవడంతో ఆయన అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, స్పాండిలైటిస్ తో బాధపడుతూ ఆయన ఇటీవల పుష్కర స్నానానికి వెళ్లిన ఫొటోలతో పవన్ బాడీ షేమింగ్ కూడా సోషల్ మీడియాలో గురయ్యారు. దీంతో్ ఆయన పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. నిజంగా ఇది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.