గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రజా రవాణాశాఖలో విలీనం చేశాక తమ సమస్యలు పెరిగాయని భావిస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తెస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో మరోసారి ప్రజా రవాణాశాఖ ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ తాజాగా పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. ఇందులో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగుల భర్తీ, అర్హత ఉన్న ఉద్యోగుల పదోన్నతులు సహా పలు డిమాండ్లు ఉన్నాయి.
ఏపీయస్ ఆర్టీసిలో భవిష్యత్ లో కొత్తగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంప్లాయీస్ యూనియన్ స్వాగతించింది. అయితే ఈ విద్యుత్ బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరింది. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య ఆర్టీసి హౌస్ లో ఆర్టీసి వైస్ చైర్మన్ అండ్ ఎండీ ద్వారకా తిరుమలరావును కోరారు.
పియస్ ఆర్టీసి కి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో మంచి పేరు ఉందని ఉద్యోగ నేతలు తెలిపారు. ఇలాంటి సంస్థను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సాయం పెరుగుతుందని, జనాభాకి అనుగుణంగా బస్సుల్ని పెంచి, ప్రజలకు మెరుగైన ప్రజా రవాణాని అందించాలన్న ధ్యేయంతో విలీనం కోరుకున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రవిభజన నాటికి ఆర్టీసిలో 62,000 మంది సిబ్బంది ఉంటే నేడు సుమారు 47,000 మంది ఉద్యోగులు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు, సుమారు 8000 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వీరుకాకుండా అద్దెబస్సుడ్రైవర్లు,ఆన్ కాల్ డ్రైవర్లు సుమారు మరో 20 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు.
విభజన నాటికి ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 20శాతం ఉంటే ఇప్పుడు 35శాతానికి పెరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని, భవిష్యత్తులో మొత్తం 2030 నాటికి ఆర్టీసీలో అన్ని బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకోవడం మంచి పరిణామం అన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యుత్ బస్సులను ఏర్పాటుకు ఎంప్లాయిస్ యూనియన్ వ్యతిరేకం కాదన్నారు. కానీ ఇప్పటికీ ఆర్టీసీలో అద్దె బస్సుల పర్సంటేజీ పెరుగుతున్న కొద్దీ సంస్థలో ఉద్యోగులను రోజురోజుకు కుదిస్తూ వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు బస్సుల నిర్వహణ లోపంతో సంస్ధకు చెడ్డ పేరు వస్తోందన్నారు. అలాగే ఆ బస్సులలో పనిచేసే సిబ్బంది వల్ల కూడా ప్రయాణికుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
అనుభవ రాహిత్యంతో ప్రైవేటు బస్సుల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతూ సంస్థ ప్రతిష్ఠ దెబ్బతింటోందన్నారు. ఇప్పటికీ ఆర్టీసీలో విద్యుత్తు ప్రైవేటు బస్సులు ప్రవేశపెట్టి అలిపిరి డిపోని ఖాళీ చేయించారని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం అవుతాయన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. కాబట్టి విద్యుత్ బస్సులన్నీ ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ద్వారానే సొంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్ బస్సుల్లో పని చేసేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో ఖాళీలను ఇప్పటికీ 12 ఏళ్లుగా కారుణ్య నియామకాలు ద్వారా తప్ప ఒక్క రెగ్యులర్ నియామకం కూడా ఏ కేటగిరీలోనూ చేయలేదన్నారు. ఖాళీలలో అర్హత గల ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చి మిగిలి ఉన్న వివిధ కేటగిరులో సుమారు 12,000 పైబడి ఉన్న ఖాళీలలో ప్రభుత్వం అనుమతి తీసుకుని రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేయాలన్నారు