ఏపీలో కాంగ్రెస్ ఖాళీ.. జగన్ వ్యూహం అదేనా?

ఏపీలో కాంగ్రెస్ ఖాళీ.. జగన్ వ్యూహం అదేనా?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ పన్నిన వ్యూహం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు బద్ధ విరోధిగా మారిన షర్మిలను దెబ్బకొట్టడంతో పాటు.. రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కు ఖాళీ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 

ఔను.. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పరిస్థితి అప్పటి నుంచీ కూడా జారుడుబండమీద నిలబడినట్లుగానే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా ఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. మరి కొందరు రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నారు. ఆ పార్టీ నుంచి వలసల ఉధృతి చూస్తుంటే.. సమీప భవిష్యత్ లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడం, అలాగే షర్మిల దూకుడుకు బ్రేకులు వేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగంగానే.. వైసీపీని వీడే వాళ్ల గురించి పట్టించుకోకుండా, బయట నుంచి నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు.అలా వచ్చేందుకు రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రెడీగా ఉన్నారు. 

గత ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కొంత మేర పుంజుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ లో నిరాశ, నైరాశ్యం, నిస్ఫృహలు అలముకున్నాయి. ఈ పరిస్థితుల్లోనే గతంలో రాష్ట్ర కాంగ్రెస్ లో  చక్రం తిప్పిన సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నా వారు పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు సరికదా.. కనీసం పార్టీ కార్యాలయంవైపు కూడా కన్నెత్తి చూడటంలేదు. అలాంటి వారిపై జగన్ దృష్టి పెట్టారు. వైసీపీలోకి వస్తే వారి సీనియారిటీకి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇస్తూ వారిని ఫ్యాన్ గూటికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకున్నారు. 

ఇప్పుడిక ఆయన కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేశారని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది. వైసీపీలోకి చేరనున్న కాంగ్రెస్ సీనియర్ల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వంటి వారు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. అలాగే మాజీ ఎంపీ హర్షవర్థన్ ను కూడా జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు.

సీనియర్ల చేరికతో వైసీపీలో కొత్త ఊపు వస్తుందని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే గత ఐదేళ్ల జగన్ పాలనపై జనంలో ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యిందో చూసిన తరువాత కాంగ్రెస్ సీనియర్లు ఆయన పంచన చేరే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. అయినా కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు వైఎస్ కుమార్తె చేతిలో ఉన్నందున వైఎస్ ను నిజంగా అభిమానించే నేతలెవరూ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరే అవకాశాలు లేవని అంటున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these