ANDHRA PRADESH: టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని.. చంద్రబాబు సమక్షంలో చేరిక

టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని.. చంద్రబాబు సమక్షంలో చేరిక

వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. సైకిల్ ఎక్కేశారు. గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతోపాటు ఆయన కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత నుంచి వైసీపీకి దూరంగా ఉన్న ఆళ్ల నాని.. ఎట్టకేలకు గతేడాది చివర్లోనే వైసీపీకి గుడ్‌బై చెబుతూ పార్టీకి.. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి స్థానిక నాయకత్వం అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఆలస్యం అయింది.

తాజాగా ఉండవల్లికి వెళ్లిన ఆళ్ల నాని.. అక్కడ ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కండువా కప్పుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి అప్పుడప్పుడు ఆళ్ల నాని.. సైకిల్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు రాగా.. అవన్నీ వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో వెంటనే ఆయన పార్టీలో చేరిపోయారు.

మరోవైపు.. ఇప్పటికే ఆళ్ల నాని టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆళ్ల నాని 3 సార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి మంత్రిగా పనిచేశారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. దీంతో చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వస్తుందని వేచి చూడగా.. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. ఏలూరు నియోజకవర్గంతో పాటు బలమైన సామాజికవర్గం నేత తమకు అవసరం అని భావించిన టీడీపీ హైకమాండ్ ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆళ్ల నాని.. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు నాయుడు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these