Pawan Kalyan : ఫీల్డ్ లో ఏం జరుగుతుందో అర్థమవుతుందా సామీ?

ఫీల్డ్ లో ఏం జరుగుతుందో అర్థమవుతుందా సామీ?

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. జనసేన వంద శాతం స్ట్రయిక్ రేట్ ను సాధించింది. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఆరు స్థానాల్లోనే గెలిచింది. మిగిలిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలతో పాటు వైసీపీ, బీజేపీ ఓటమి పాలయిన శాసనసభ నియోజకవర్గాల్లో సహజంగా టీడీపీ ఇన్ ఛార్జులదే పై చేయి అయింది. ఎందుకంటే టీడీపీ యాభై వసంతాలు నిండిన పార్టీ. దానికి అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలతో పాటు క్యాడర్ కూడా ఉంది. జనసేన ఆవిర్భవించి పదేళ్లయినా అది క్షేత్ర స్థాయిలో బలోపేతం కాలేదు.

కూటమిగా పోటీ చేసినా…

జనసేనకు సామాజికవర్గం, అభిమానులు మాత్రమే ఓటు బ్యాంకు. అంతే తప్ప అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో జనసేన నేతలను వెతుక్కోవాల్సిన పరిస్థితి నేటికీ ఉంది. అయితే కూటమిగా మూడు పార్టీలు కలసి పోటీ చేయడం, జగన్ ను ఓడించడానికి అందరూ కలసి సమిష్టిగా ఒకరినొకరు సహకరించుకోవడంతో ఇంతటి అద్భుతమైన విజయం సాధించిందన్న అంశంలో ఎవరికీ వేరే ఆలోచన లేదు. అయితే ఆ నియోజకవర్గాల్లో క్యాడర్ మాత్రం ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మిత్రపక్షమైన జనసేన నేతలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు చాలా చోట్ల నుంచి వినిపిస్తున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేలు తప్పు కాకున్నా…

అది టీడీపీ ఎమ్మెల్యేల తప్పు కాదు. ఎవరైనా తమ పార్టీ నేతలకు, తమ పార్టీకి చెందిన వారికే ఎందులోనైనా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తారు. ఇతర పార్టీల నేతలకు వారు మిత్రపక్షమైనా ప్రయోజనాలు చేకూరిస్తే భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని కూడా తప్పుపట్టడానికి లేదు. వాళ్లు తమ వారికే న్యాయం చేయాలనుకుంటారు. పదవుల్లోనైనా, కాంట్రాక్టు పనులనైనా వారికే అప్పగించేందుకు సిద్ధమవుతారు. ఇది జనసేన స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోనే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. దీంతో జనసేన స్థానిక నాయకులు తమకు న్యాయం చేయడం లేదని అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

అనేక జిల్లాల్లో…

తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ జనసేన నేత సంతోష్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం విజయవాడలో చికిత్స పొందుతున్నారు. జనసేన ప్రాధాన్యత ను తగ్గిస్తున్నారంటూ ఎంఎల్ఏ ముందు ఆత్మహత్య యత్నం చేసిన జనసేన నాయకుడు సంతోష్పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి కొనసాగిస్తున్నారు. టిడిపి నాయకుల దురుసు వైఖరిని ప్రశ్నించిన పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్య యత్నానికి సంతోష్ పాల్పడ్డారని స్థానిక జనసేన నేతలు తెలిపారు. ఇలా అనేక నియోజకవర్గాల్లో పరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదన్న వార్తలు అనేకం వస్తున్నాయి. అందుకే పవన్ ఫీల్డ్ లెవెల్ లో ఫోకస్ చేయకపోతే ఉన్న పార్టీ క్యాడర్ చేజారి పోయే పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these