Telangana : రచ్చ రచ్చగా మారిన గ్రామసభలు..రగడగా మారుతున్న లబ్దిదారుల ఎంపిక… ఇదేంది సామీ

రచ్చ రచ్చగా మారిన గ్రామసభలు..రగడగా మారుతున్న లబ్దిదారుల ఎంపిక...

ప్రజా పాలన గ్రామ సభల్లో ప్రజలు అధికారులపై తిరగబడుతున్నారు. అనేక గ్రామ సభల్లో రచ్చ రచ్చగా మారింది. నాలుగు పథకాలకు సంబంధించిన అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు గ్రామసభలను తెలంగాణలో నిర్వహిస్తున్నారు. అయితే గ్రామ సభల్లో జనం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఈ నెల 21 నుంచి గ్రామసభలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రామ సభల్లోనే అర్హులైన లబ్దిదారుల పేర్లను ప్రకటిస్తున్నారు. అయితే తమ పేర్లు లేకపోవడాన్ని గుర్తించిన ప్రజలు అనర్హులకు పథకాలను ఇస్తున్నారని, వారి సొంత పార్టీ వారికే సంక్షేమ పథకాలు దక్కేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపణలు వినపిస్తున్నాయి.

అనేక జిల్లాల్లో…

నల్లగొండ, సూర్యపేట, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరుగుతున్న సభల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు పథకాలకు సంబంధించిన నిధులను ఈ నెల 26వ తేదీ నుంచి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఆరు కేజీలు ఇస్తామని కూడా ప్రకటించింది. దీంతో పోటీ పెరిగింది. తమకు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వరని, తమ పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు.

అడ్డుకుంటూ…

గ్రామ సభలను అడ్డుకుంటున్నారు.మంచిర్యాల, చెన్నూరులో జరుగుతున్న గ్రామసభలను నిలిపేయాలని ప్రజలు అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా జిన్నారం గ్రామంలో జరిగిన గ్రామసభను ప్రజలు అడ్డుకున్నారు. అనర్హుల పేర్లను జాబితాలో చేర్చడమే కాకుండా తమకు అర్హత ఉన్నా ఎందుకు పేర్లు చేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభలు రచ్చరచ్చగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు లేకపోవడంతో అధికారులు ప్రజలు పెద్దయెత్తున నిరసన తెలియజేయడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. గ్రామసభల్లో అర్హులైన లబ్దిదారుల జాబితాను ప్రకటిస్తున్నసమయంలోనే గందరగోళం నెలకొంది.

ప్రభుత్వ వాదన ఇదీ…

ప్రభుత్వం మాత్రం అర్హులైన అందరికీ పథకాలు అందుతాయని చెబుతుంది. ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని చెబుతుంది. కానీ గ్రామ సభల్లో మాత్రం రగడ ఆగడం లేదు. విపక్షాలు కూడా గ్రామసభలు నిర్వహిస్తున్న తీరుపై ధ్వజమెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అయితే తమ పార్టీ వారి పేర్లనే జాబితాలో చేరుస్తున్నారని, ఇతర పార్టీల వారికి అందులో చోటు కల్పించడం లేదని, అనర్హులైనప్పటికీ కాంగ్రెస్ సానుభూతి పరులకు సంక్షేమ పథకాలను అందించే కార్యక్రమానికి తెరతీశారంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం అందులో నిజం లేదని, అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా పరిశీలించి వారికి పథకాలు కేటాయిస్తామని చెబుతుంది. మొత్తం మీద గ్రామసభలన్నీ రచ్చరచ్చగా మారుతుండటం అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these