పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే స్వాగతిస్తా.. టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..

Tdp Mla Adireddy Srinivas Interesting Comments On Pawan Kalyan As Cm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. అయితే టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లోకేష్‌ను ముఖ్యమంత్రిని కూడా చేయాలి అంటూనే.. పవన్ కళ్యాణ్‌ను కూడా సీఎంను చేస్తే స్వాగతిస్తానన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో రాజకీయం వేడెక్కింది. అయితే రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ముఖ్యమంత్రి కూడా కావాలి అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కూటమిలో పెద్దలు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. పార్టీ నేతలు ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని.. అలాగే లోకేష్‌ డిప్యూటీ సీఎం కావాలని.. సీఎం చంద్రబాబు చెబితేనే ప్రాధాన్యం ఉంటుందన్నారు. అయితే డిప్యూటీ సీఎం, సీఎం పదవులు అంటూ టార్గెట్‌గా చేసుకుని వైఎస్సార్‌సీపీ సైకోలు కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిరెడ్డి శ్రీనివాస్.

మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆసక్తికరంగా స్పందించారు. జనసేన పార్టీ నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని.. సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకోవడంలో తప్పు లేదని.. తాము కూడా పవన్ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పవన్‌ సీఎం అవ్వాలని.. ఆయన్ను పదవిలో చూడాలని బడుడు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో.. అదే కొనసాగిస్తూ ముందుకు సాగితే మంచిదన్నారు కిరణ్ రాయల్. కొన్ని అనవసరమైన వ్యాఖ్యలతో వైఎస్సార్‌సీపీ నేతల మాటలకు ఊపిరి పోయొద్దని.. కొందరు ఆ పార్టీ నేతలు జేబుల్లో మైకులు పట్టుకుని తిరుగుతున్నారన్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దన్నారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావాల్సిన నేత అని.. ఆయనకు సెక్యూరిటీ పెంచాలని కోరారు కిరణ్ రాయల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these