నారా లోకేష్‌తో మంచు విష్ణు భేటీ.. కారణాలపై సస్పెన్స్..!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మంచు విష్ణు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన సోదరుడు, డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్‌తో అనేక అంశాలపై చర్చించానంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే నారా లోకేష్‌తో భేటీలో మంచు విష్ణు ఏం చర్చించారనేదీ ఆసక్తికరంగా మారింది. పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్వీట్ చేసిన మంచు విష్ణు.. అవి ఏమిటనే విషయాలను మాత్రం బహిర్గతం చేయలేదు.

సినీ నటుడు మంచు విష్ణు.. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. నారా లోకేష్‌తో భేటీ అయిన విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వివిధ అంశాలపై తన సోదరుడు, డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని మంచు విష్ణు ట్వీట్ చేశారు. నారా లోకేష్ పాజిటివ్ ఎనర్జీ అద్భుతమన్న మంచు విష్ణు.. నారా లోకేష్‌కు దేవుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా.. హరహర మహదేవ్ అంటూ ట్వీట్ చేశారు. అయితే పలు అంశాల గురించి నారా లోకేష్‌తో అర్థవంతమైన చర్చలు జరిగాయన్న మంచు విష్ణు.. అవి ఏంటనే విషయాలను వెల్లడించలేదు. కన్నప్ప సినిమా విషయంలో కలిశారా అని అనుకుంటే.. కన్నప్ప సినిమా విడుదలకు చాలా సమయం ఉంది.

2025 ఏప్రిల్ 25వ తేదీ కన్నప్ప సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ అయిన ఈ సినిమాను.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ఇంకా ఐదు నెలల వరకూ సమయం ఉంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు నారా లోకేష్‌తో భేటీ కన్నప్ప గురించి అయ్యుండే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మంచు ఫ్యామిలీకి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమీప బంధువు అవుతారనే విషయం తెలిసిందే. గతంలో మంచు మోహన్‌బాబు కుటుంబం వైసీపీకి మద్దతుగా నిలిచింది. అయితే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్‌తో మంచు విష్ణు భేటీ కావటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంచు విష్ణు చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు.. నారా రామ్మూర్తి నాయుడు ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను వారి సొంతూరు నారావారిపల్లెలో నిర్వహించారు. అంత్యక్రియలకు మంచు మోహన్ బాబు చిన్నకుమారుడు మంచు మనోజ్ తన సతీమణి మౌనిక, తల్లితోపాటు హాజరయ్యారు. నారా రామ్మూ్ర్తి నాయుడు చనిపోయిన సమయంలోనూ మంచు మనోజ్.. నారా రోహిత్‌కు తోడుగా నిలబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these