ఐఐటీ- చెెన్నై నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. రాష్ట్ర రాజధానిగా మళ్లీ అమరావతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
టీమ్‌లో ఎవరు?
ఐఐటీ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్, ఫౌండేషన్ ఎక్స్‌పర్ట్ శుభ్‌దీప్ బెనర్జీ, కొరోసన్ స్టడీస్ ఎక్స్‌పర్ట్ రాధాకృష్ణ పిళ్లై ఈ టీమ్‌లో సభ్యులు. శనివారం సాయంత్రం అమరావతిలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలను సందర్శించారు. ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను పరిశీలించారు.
చెరువును తలపించి..
భారీ వర్షాల వల్ల ర్యాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతం మొత్తం నీట మునిగింది. చెరువును తలపించింది. దీనితో ఐఐటీ నిపుణులు బోటును వినియోగించాల్సి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాల సహాయంతో బోట్ల ద్వారా వాళ్లు ర్యాఫ్ట్ ఫౌండేషన్లను క్షుణ్నంగా పరిశీలించారు.
ఐకనిక్ టవర్ల స్థితి..
అసంపూర్తిగా ఉన్న శాశ్వత సచివాలయ కట్టడం, వివిధ విభాగాధిపతుల కోసం ప్రతిపాదించిన ఐకనిక్ టవర్లకు చెందిన పిల్లర్లపై అధ్యయనం చేశారు. చాలాకాలంగా ఈ ప్రాంతం అంతా నీటిలో మునిగి ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా- వాటి నిర్మాణంలో వినియోగించిన ఇనుము తుప్పు పట్టి ఉండొచ్చని అంచనా వేశారు.
ఎంతవరకు బలం..
సుదీర్ఘకాలంగా నీటిలో నానుతుండటం వల్ల ఆయా కట్టడాల పునాదులు ఎంతమేరకు బలంగా ఉంటాయనేది అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సచివాలయం, ఐకనిక్ టవర్లను అతి ఎత్తయిన కట్టడాలుగా నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
అయిదేళ్ల నిర్లక్ష్యం..
అయిదు సంవత్సరాల తరువాత కూడా అదే తరహా నిర్మాణాలను కొనసాగించాలా? లేదా? అనే విషయంపై ఐఐటీ చెన్నై నిపుణుల బృందం నిర్ధారిస్తుంది. దీనికోసం ఆయా కట్టాలను నిర్మించాలని ప్రతిపాదించిన ప్రదేశంలో మరోసారి భూసార పరీక్షలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
అసంపూర్తిగా..
2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో శాశ్వత సచివాలయం, ఐకనిక్ టవర్ల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. దీనివల్ల అమరావతిలో ఆయా కట్టడాల నిర్మాణం అసంపూర్తిగా నిలిచింది.